AP: ఆందోళనలతో రగులుతున్న ఏపీ

AP: ఆందోళనలతో రగులుతున్న ఏపీ
వాలంటీర్లు, అంగన్‌వాడీలు, పారిశుద్ధ్య కార్మికుల ఆందోళనలు... నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్‌ ఆందోళనలతో రగిలిపోతోంది. అంగన్‌వాడీలు, ఆశావర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, ఇప్పుడు వాలంటీర్లు. అందరూ పోరుబాట పట్టి...ఉద్యమాన్ని హోరెత్తిస్తున్నారు. ఎన్నికల ముందు జగన్‌ చెప్పిన తీపి కబుర్లు ఏమయ్యాయని వారంతా మండిపడుతున్నారు. జగన్‌ తీరని ద్రోహం చేశారని వారంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అంగన్వాడీలు, ఆశావర్కర్లు, హోంగార్డులు ఎన్నికలకు ముందు జగన్‌ ఇచ్చిన హామీలు అమలు కాలేదంటూ పోరాటాలు చేస్తుంటే.... వారిపైనే కత్తికట్టారు. మరో మూడు నెలల్లో ఈ ప్రభుత్వం గడువు ముగుస్తున్నా...ఇచ్చిన హామీలేవీ నెరవేర్చకపోవడంతో ఇప్పుడు రోడ్డెక్కారు. డిమాండ్ల సాధనకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తున్నారు. జగన్‌ సర్కారు మెడలు వంచేందుకు కదం తొక్కుతున్నారు. అంగన్‌వాడీలు 2 వారాలుగా రోడ్డెక్కి పోరాడుతుంటే మంగళవారం నుంచి పారిశుద్ధ్య కార్మికులూ సమ్మెకు దిగారు. ఆశావర్కర్లు డిమాండ్ల సాధనకు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. నిన్నమొన్నటిదాకా జగన్‌ సర్కారు అన్ని కార్యక్రమాలకూ ఎక్కువగా ఆధారపడుతున్న వాలంటీర్లూ షాక్‌ ఇచ్చారు. వారు సైతం సమ్మె నోటీసు ఇవ్వడం ఇప్పుడు సర్కారుకు మింగుడు పడడం లేదు .


అంగన్‌వాడీలకు తెలంగాణలో కంటే ఎక్కువ వేతనం ఇస్తానని బీరాలు పలికిన జగన్‌... అధికారంలోకి వచ్చాక నెలకు వెయ్యి రూపాయల చొప్పున వేతనం పెంచి...చేతులు దులిపేసుకున్నారు. లక్షకుపైగా ఉన్న అంగన్‌వాడీలు వివిధ రూపాల్లో ఆందోళనలు చేస్తూనే ఉన్నా... వారి గోడూ వినే ఓపిక లేకపోయింది. పైగా వారిపైనే పోలీసుల్ని ప్రయోగించి ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. కొన్నిచోట్ల రాత్రిపూటా పోలీసుస్టేషన్లలో ఉంచారు. పనికి తగ్గట్టుగా తమకు వేతనాలు పెంచాలని, సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం గ్రాట్యుటీని అమలుచేయాలని అంగన్‌వాడీలు చేస్తున్న ఆందోళనను జగన్‌ ప్రభుత్వం చెవికెక్కించుకోలేదు. పారిశుద్ధ్య కార్మికులు చేసే పని మామూలుగా ఎవరూ చేయలేరు. వాళ్ల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకోవాలి. వాళ్ల వేతనాల్ని 18వేలకు పెంచామని....2019 జూన్‌ 20న అసెంబ్లీలో జగన్‌ పలికిన చిలకపలుకులివి. వాస్తవానికి వారికి పెంచింది వేతనం కాదు. 6వేల చొప్పున ఆరోగ్యభృతి. అదీ నగర, పురపాలక సంస్థల్లోని పారిశుద్ధ్య కార్మికులకే ఇచ్చారు. ఇంజినీరింగ్‌ విభాగంలో పనిచేసే వారికి పెంచలేదు. పైగా పారిశుద్ధ్య కార్మికుల్ని ఔట్‌సోర్సింగ్‌ కార్పొరేషన్‌ - ఆప్కాస్‌ పరిధిలోకి తెచ్చాక... వారిని ఉద్యోగులుగా చూపించి ప్రభుత్వ పథకాలు కోసేశారు. ‘సమాన పనికి, సమాన వేతనం’కింద నెలకు 26వేల వేతనం, అదనంగా ఆరోగ్యభృతి ఇవ్వాలని, ఉద్యోగాలు క్రమబద్ధీకరించాలని పారిశుద్ధ్య కార్మికులు ఎప్పటి నుంచో డిమాండ్‌ చేస్తున్నారు. సంక్షేమ పథకాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చిన సర్కారు...ఇంత వరకు నెరవేర్చలేదని …దాదాపు 50వేల మంది ఇప్పుడు సమ్మెకు దిగారు.


ఆశావర్కర్లు ఆశా వర్కర్లు డిమాండ్ల సాధనకు ఎప్పుడు గొంతెత్తినా నొక్కేస్తూనే ఉన్నారు. ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో వారు ఆందోళన ఉద్ధృతం చేశారు. ఇప్పటికే సర్కారుకు సమ్మె నోటీసులు ఇచ్చిన వారు.. ఈ నెల 14, 15 తేదీల్లో అన్ని జిల్లాల కలెక్టరేట్ల వద్ద ఆందోళన చేపట్టారు. సమగ్రశిక్షా అభియాన్‌లో పనిచేస్తున్న పొరుగుసేవల ఉద్యోగులూ పోరుబాట పట్టారు. కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న ఒప్పంద ఉద్యోగులు మినిమమ్‌ టైంస్కేల్‌ అమలు చేయాలంటూ నేటి నుంచి సమ్మెలోకి దిగుతున్నారు. జగన్‌ ప్రభుత్వానికి సొంత సైన్యంలా ఉన్న గ్రామ, వార్డు వాలంటీర్లకూ కడుపు మండింది. ప్రభుత్వం, పార్టీ అన్న తేడా లేకుండా అన్ని పనులకూ తమను వాడేస్తున్న సర్కారు...శ్రమకు తగ్గ ప్రతిఫలం ఇవ్వడం లేదన్న కోపంతో వారు రగిలిపోతున్నారు. ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధమయ్యారు.

Tags

Read MoreRead Less
Next Story