AP: ఏపీ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం

AP: ఏపీ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం
ఒకే వేదికపైకి మూడు పార్టీల అధ్యక్షులు... టీడీపీ-బీజేపీ-జనసేన శ్రేణుల్లో మెరిసే ఉత్సాహం

జగన్‌ గొడ్డలి వేటుకు బలికాని వాళ్లు ఆంధ్రప్రదేశ్‌లో ఎవరైనా ఉన్నారా ఎవరైనా బాగున్నారా అని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ప్రశ్నించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ప్రజాగళం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరితో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఐదేళ్ల వైకాపా పాలనలో వైఫల్యాలపై మూడు పార్టీల అధ్యక్షులు నిప్పులు చెరిగారు. రాబోయేది కూటమి ప్రభుత్వమేనని... అన్ని వర్గాలకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.


ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం, జనసేన, బీజేపీ అధ్యక్షులు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, పురందేశ్వరి తొలిసారి ఒకే వేదికపై మెరిసి శ్రేణుల్లో ఉత్సాహన్ని నింపారు. సభకు భారీగా తరలివచ్చిన మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు అధినేతలకు హర్షధ్వానాలు పలికారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో నిర్వహించిన సభకు తణుకు నుంచి రోడ్డు మార్గంలో చంద్రబాబు, పవన్‌ చేరుకున్నారు. ఈ సందర్భంగా దారిపొడవునా అభిమానులు బ్రహ్మరథంపట్టారు. మూడు పార్టీల త్యాగం రాష్ట్ర సంక్షేమం కోసమేనని చంద్రబాబు పునరుద్ఘాటించారు. రాష్ట్రంలో ఆడబిడ్డలకు అన్యాయం జరిగిందని మండిపడ్డారు. అన్ని ధరలు, విద్యుత్ ఛార్జీలను పెంచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఎదిరించే వాళ్లు లేకపోతే బెదిరించే వాళ్లదే రాజ్యమని బెదిరించే వాళ్లకు సమాధానం చెప్పేందుకు ఒక సముహం వచ్చిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రౌడీరాజ్యం పోవాలి...రామరాజ్యం రావాలి...ధర్మం నిలబడాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలను అయిదుగురు గుప్పెట్లో పెట్టుకుని బెదిరిస్తున్నారని.....ప్రజల్లో తిరుగుబాటు మొదలైందన్నారు. వైఎస్‌ వివేకాను చంపిన హంతకులను వెనకేసుకొస్తున్నారని....వాళ్ల ఇంట్లో వాళ్లకే రక్షణ లేదని సొంత చెల్లెల్నే గోడకేసి కొట్టారని ఆరోపించారు. వైసీపీ వైపరీత్యంతో రాష్ట్రం అన్ని విధాలా కుదేలైందని భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి విమర్శించారు. బీసీ కమిషన్‌కు కేంద్రం చట్టబద్ధత కల్పిస్తే రాష్ట్రంలో కల్పించకుండా వైసీపీ బీసీలకు అన్యాయం చేసిందని దుయ్యబట్టారు.

అంతకుముందు జగన్ కబంధ హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాలని... తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వైకాపా పాలనలో రాష్ట్రం వెంటిలేటర్ పైకి వెళ్లిందన్న ఆయన అధికారం ఇస్తే NDA కూటమి ఆక్సిజన్ గా పనిచేస్తుందని సూచించారు.దగాపడిన రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు...ప్రజలు కలిసిరావాలనికోరారు. 30 రోజులపాటు ప్రజలు రాష్ట్రం కోసం పనిచేస్తే... ఐదేళ్లపాటు వారి కోసం తాముపనిచేస్తామని పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story