AP: అంబరాన్నంటుతున్న సంక్రాంతి సంబరాలు

AP: అంబరాన్నంటుతున్న సంక్రాంతి సంబరాలు
భోగి మంటలు, హరిదాసు కీర్తనలు.... ముగ్గుల పోటీల నిర్వహణ...

ఆంధ్రప్రదేశ్‌లో భోగి మంటలు, హరిదాసు కీర్తనలు, గంగిరెద్దుల విన్యాసాలు, ముత్యాల ముగ్గులు, గొబ్బిళ్లు, సంప్రదాయ వేషధారణలతో... రాష్ర్టవ్యాప్తంగా ముందస్తు సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. వివిధ ప్రాంతాల్లో కళాశాల విద్యార్థులు, మహిళలు... నృత్యాలు చేస్తూ సందడి చేశారు. పలువురు రాజకీయ నేతలు ముగ్గుల పోటీలు నిర్వహించి, విజేతలకు బహుమతులు అందజేశారు. సంప్రదాయ ఆటలు, క్రీడా పోటీలతో పల్లెలు, పట్టణాల్లో పండుగ వాతావరణం నెలకొంది.


ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా సంక్రాంతి ముందస్తు వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో తెలుగు సంస్కృతి ఉట్టిపడేలా.. భోగి మంట వేసి నృత్యాలు చేస్తూ మహిళలు సందడి చేశారు. రంగవల్లుల పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు అందజేశారు. అనకాపల్లిలోని డైట్ ఇంజనీరింగ్ కాలేజీలో.. సంక్రాంతి శోభ సంతరించుకుంది. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అంబేద్కర్‌ కోనసీమ జిల్లా పి.గన్నవరంలోని స్థానిక జడ్పీ ఉన్నత పాఠశాలలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. మహిళలు పాటలు పాడుతూ సందడి చేశారు. చిన్నారులకు భోగిపండ్లు పోసి ఆశీర్వదించారు. ప్రభలను గ్రామంలో ఊరేగించారు. విశాఖలోని ఎస్బీఐ జోనల్‌ కార్యాలయం ఆవరణలో పండుగ శోభ ప్రతిబింబించేట్టుగా ఏర్పాటు చేసిన గంగిరెద్దులు, హరిదాసులు, రంగవల్లికలు ఆకట్టుకున్నాయి. బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు ఆధ్వర్యంలో తప్పెటగుళ్లు, కోలాటాలు, పులివేషాలు, సంక్రాంతి ముగ్గులతో ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం కళకళలాడింది. సంక్రాంతి ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేసేలా విజయనగరంలో మైత్రీ మీడియా.. సంక్రాంతి సంబరాలు పేరిట రంగవల్లులు, ఆటపోటీలు నిర్వహించాయి. కోలాటం, దాండియా నృత్యాలు, ఫ్యాషన్ డ్రెస్ పోటీలతో చిన్నారులు కనువిందు చేశారు. విజేతలకు బంగారు బహుమతులను అందజేశారు.


అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గ పరిధిలో జనసేన నాయకులు ముగ్గుల పోటీలు, మ్యూజికల్‌ చైర్స్‌ పోటీలు నిర్వహించారు. గెలుపొందిన మహిళలకు నగదు, చీరలు అందజేశారు. సంక్రాంతి పండుగను చిత్తూరు ప్రజలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలంటూ తెదేపా నేత గురజాల జగన్మోహన్ నాయుడు 42 వేల మందికి చంద్రన్న సంక్రాంతి కానుక పేరుతో నిత్యావసర వస్తువుల పంపిణీ ప్రారంభించారు. పిండివంటలు తయారీ కోసం నిత్యవసర వస్తువులు కొనుగోలు చేసేందుకు వినియోగదారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో నెల్లూరు, కావలి, కందుకూరులోని దుకాణాలు కిటకిటలాడాయి.

Tags

Read MoreRead Less
Next Story