AP New Districts: ఏపీలో ముదురుతున్న కొత్త జిల్లాల వివాదం.. పలు చోట్ల నిరసన ర్యాలీలు..

AP New Districts: ఏపీలో ముదురుతున్న కొత్త జిల్లాల వివాదం.. పలు చోట్ల నిరసన ర్యాలీలు..
AP New Districts: ఏపీలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది జగన్ ప్రభుత్వం.

AP New Districts: ఏపీలోని 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేసింది జగన్ ప్రభుత్వం. 26 జిల్లాలతో గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన ఏపీ ప్రభుత్వం.. ప్రజలు, ప్రజా సంఘాల నుంచి ప్రజాభిప్రాయం కోరుతోంది. ఫిబ్రవరి 26వ తేదీ వరకు ఎవరైనా తమ అభిప్రాయాలు చెప్పొచ్చని తెలిపింది. అయితే జిల్లాల పునర్విభజనను కొందరూ వ్యతిరేకిస్తుండగా.. మరికొందరు మిశ్రమంగా స్పందిస్తున్నారు.

రాజకీయ ఎత్తుగడతోనే జగన్‌ ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు తెరలేపిందని విమర్శిస్తున్నారు. కొత్త జిల్లాల ప్రకటన వచ్చిందే తడవు ఆయా ప్రాంతాల్లో నిరసనలు మిన్నంటాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేయగా.. అనంతపురం జిల్లా వాసుల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు.. జిల్లాల విభజన

చేస్తున్నామని ప్రభుత్వం తెలుపగా. పీఆర్సీ ఉద్యమాన్ని అణిచివేసేందుకే కొత్త జిల్లాలను జగన్‌ సర్కార్‌ తెరపైకి తెచ్చిందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక అనంతపురం జిల్లాలో చాలా చోట్ల మౌలిక సదుపాయాలు కూడా సరిగ్గా లేవని.. ఇలాంటి సమయంలో కొత్తగా ఏర్పడే జిల్లాల్లో సామాన్యులు తీవ్ర ఇబ్బంది పడతారని పేర్కొంటున్నారు. జిల్లాల ప్రకటన విషయంలో హిందూపురంకు తీవ్ర అన్యాయం జరిగిందని స్థానిక నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

రాజ్యాంగం ప్రకారం నూతన జిల్లా ఏర్పాటు చేయాలంటే ప్రభుత్వం జనాభా, పారిశ్రామిక సదుపాయాలు కలిగిన ప్రాంతాలను పరిగణలోకి తీసుకోవాలి.. కానీ అందుకు విరుద్ధంగా జగన్‌ సర్కార్‌ కేవలం సర్వేలు నిర్వహించి ఇష్టానుసారంగా జిల్లాలను ప్రకటించారంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూపురానికి తీవ్ర అన్యాయం చేశారని.. స్థానిక అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద ఆందోళన చేపట్టారు.

కర్నూలు జిల్లాకు దివంగత దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య పేరు పెట్టాలని.. టీడీపీ నేత సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. కృష్ణా జిల్లాకు స్వర్గీయ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ పేరు పెట్టడాన్ని స్వాగతిస్తున్నామన్న ఆయన.. నంద్యాలకు కేంద్రం మంత్రిగా సేవలు అందించిన పెండే కంటి వెంకట సుబ్బయ్య పేరు.. గుంటూరు జిల్లాకు దివంగత సీఎం రోశయ్య గారి పేరు పెట్టాలన్నారు. దీని కోసం ఆర్యవైశ్యులందరూ పార్టీలకు అతీతంగా స్పందించి.. సీఎం జగన్‌కు విజ్ఞప్తి చేయాలని సూచించారు.

జిల్లాల పునర్విభజనలో భాగంగా.. కందుకూరు నియోజకవర్గానికి అన్యాయం జరుగుతోందని అఖిలపక్షం నేతలు రౌండ్‌ టేబుల్‌ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైసీపీ మినహా అన్ని పార్టీలు వచ్చాయి. కందుకూరు రాష్ట్ర ప్రభుత్వం అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. దీనికి నైతిక బాధ్యతతగా.. స్థానిక ఎమ్మెల్యే మానుగుంట మహీధర్‌ రెడ్డి రాజీనామా చేయాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వం ఇలానే మూర్ఖంగా ముందుకు పోతే కోర్టుల్లో ... మరో మొట్టికాయ తప్పదని విమర్శించారు.

ఇక కోనసీమను అంబేద్కర్‌ జిల్లాగా మార్చాలని.. ముమ్మిడివరం నియోజకవర్గం దళిత సంఘాల నాయకులు డిమాండ్‌ చేస్తున్నారు. ఐ పోలవరం మండలంలో.. దళిత సంఘాల నాయకులు సమావేశం అయ్యారు. పుట్టపర్తి సాయి బాబా, ఎన్టీఆర్‌, అల్లూరి సీతారామరాజుల పేర్లు జిల్లాలకు పెట్టినట్లే... భారత రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్‌ అంబేద్కర్‌ పేరు.. కోనసీమకు పెట్టాలని డిమాండ్‌ చేశారు.

కడపలోనూ రెండు జిల్లాల పేర్ల రచ్చ కొసాగుతోంది. రాజంపేట పార్లమెంట్‌ నియోజకవర్గం కొత్త జిల్లాగా ఏర్పాటు చేస్తునట్లు ప్రభుత్వం పేర్కొంది. దీనికి రాజంపేటే హెడ్‌ కోటర్స్‌ అని పేర్కొంది. అయితే ఈ జిల్లానుఅన్నమయ్య జిల్లాగా పేరు పెట్టి.. రాయచోటిని హెడ్‌ క్వార్టర్స్‌గా ప్రకటించాలని స్థానికులు డిమాండ్‌ చేస్తున్నారు. ఇదిలా ఉంటే రైలు, రోడ్డు కనక్టివిటీ, తాగునీటి సౌకర్యం లేని రాయచోటిని జిల్లా హెడ్‌ క్వార్టర్స్‌ గా పెట్టడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story