ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పట్నుంచి మరో లెక్క.. : టీడీపీ

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పట్నుంచి మరో లెక్క.. : టీడీపీ
పుర‌పాలక ఎన్నిక‌ల్లో విజయం కోసం వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీలోని ముఖ్యుల‌ను అంద‌రినీ ప్రచార రంగంలోకి దించుతోంది.

పంచాయతీ పోరు ముగిసింది.. ఇక పురపోరుకు ఏపీ సిద్ధమవుతోంది.. ప్రశాంతంగా ఎన్నికలు నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తుంటే.. పార్టీలన్నీ గెలుపు కోసం అస్త్రశస్త్రాలకు పదును పెడుతున్నాయి.. ముఖ్యంగా అధికార వైసీపీకి మరోషాకిచ్చేందుకు టీడీపీ సిద్ధమవుతోంది.. మున్సిపల్‌ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పావులు కదుపుతోంది.

ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇప్పట్నుంచి మరో లెక్క.. పురపోరులో తడాఖా చూపిస్తామంటోంది టీడీపీ.. పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన కిక్‌తో పురపోరుకు తమ్ముళ్లు సిద్ధమవుతున్నారు. 12 కార్పొరేష‌న్లు, 75 మున్సిపాలిటీలకు మార్చిలో జరగనున్న ఎన్నిక‌ల‌ను స‌వాల్‌గా తీసుకున్నారు. ఇప్పటికే నేత‌ల‌ మధ్య నెలకొన్న విభేదాలపై దృష్టిపెట్టిన అధినేత‌ చంద్రబాబు.. వాటిని స్వయంగా పరిష్కరిస్తున్నారు.. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

రాష్ట్రంలో పంచాయ‌తీ ఎన్నిక‌లు ముగియ‌డంతో మార్చిలో జరిగే మున్సిపల్‌ ఎన్నికలపైనే చర్చంతా నడుస్తోంది. వ‌చ్చే నెల 10న జ‌రిగే పుర సమరానికి పార్టీలన్నీ స‌మాయ‌త్తం అవుతుండగా, టీడీపీ ఈఎన్నికలను మరింత సీరియస్‌గా తీసుకుంది. పంచాయ‌తీ ఎన్నికల్లో అధికార వైసీపీకి గ‌ట్టి పోటీ ఇవ్వగా.. త‌మ‌కు క‌లిసి వ‌చ్చే పట్టణ ప్రాంత ఎన్నిక‌ల్లో మంచి ఫలితాలు సాధించాలని భావిస్తోంది. పుర‌పాలక ఎన్నిక‌ల్లో విజయం కోసం వ్యూహాలకు పదును పెడుతోంది. పార్టీలోని ముఖ్యుల‌ను అంద‌రినీ ప్రచార రంగంలోకి దించుతోంది.

ముఖ్యంగా కార్పొరేషన్లపై టీడీపీ ప్రత్యేక దృష్టిపెట్టింది. విజ‌య‌వాడ‌, గుంటురు, విశాఖ కార్పొరేషన్లు టీడీపీకి పరీక్షగా నిలవబోతున్నాయి. వీటిలో గెల‌పుకోసం టిడిపి భారీ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. జిల్లాలోని ఇత‌ర ప్రాంతాల నుంచి సైతం నేత‌ల‌ను కార్పొరేషన్‌ ఎన్నిక‌ల‌ ప్రచారానికి పంపుతోంది. స్వయంగా అధినేత చంద్రబాబు ఎన్నిక‌ల ప్రచారానికి వెళ్లనున్నారు. ఓవైపు అచ్చెన్నాయుడు, లోకేష్ మ‌రోవైపు విస్తృత పర్యటనలకు రంగం సిద్ధం చేస్తున్నారు. టీడీపీ అగ్రనేతలు అంతా ప్రచారం నిర్వహించనున్నారు.

మాజీ మంత్రులు, మంచి వాగ్దాటి క‌లిగిన నేత‌ల‌ను సైతం ప్రచారానికి పంపనుంది టీడీపీ అధిష్ఠానం. సీనియర్లను ఇన్‌ఛార్జ్‌లకుగా నియమించనుంది. ఇక ఇప్పట్లో తిరుప‌తి ఉప ఎన్నికలు జరిగే అవకాశాలు లేకపోవడంతో ఈ ఎన్నికలనే సవాల్‌గా తీసుకుంది. అటు పంచాయతీల్లా కాకుండా.. మున్సిపల్‌ ఎన్నిక‌లు పార్టీ సింబ‌ల్‌తో జరగనున్న నేపథ్యంలో గెలుపు ఓటముల లెక్క పక్కాగా ఉంటుందనే ధీమాలో టీడీపీ నేతలు కనిపిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story