TDP PROTEST: ఊరూరా నిరసనల హోరు

TDP PROTEST: ఊరూరా నిరసనల హోరు
చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆందోళనలు... కొనసాగుతున్న టీడీపీ శ్రేణుల దీక్షలు...

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్ట్‌ను నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఊరురా చంద్రబాబుకు మద్దతుగా నినాదాలు మార్మోగుతున్నాయి. అధినేత ఆరోగ్యం కోసం పలుచోట్ల ప్రత్యేక పూజలు, కొవ్వొత్తుల ర్యాలీలు నిర్వహించారు. చంద్రబాబును విడుదల చేయాలని కాంక్షిస్తూ టీడీపీ కార్యకర్తలు చేపట్టిన దీక్షలు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతున్నాయి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్ట్ ను నిరసిస్తూ అనంతపురం జిల్లా బెళుగుప్పలో వ్యవసాయ కూలీలు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన చేశారు. చంద్రబాబు క్షేమంగా జైలు నుంచి బయటకు రావాలని కోరుతూ వజ్రకరూరు మండలం చాబాలలో కరెమ్మ అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి తెలుగుదేశం కార్యకర్తలు 101 టెంకాయలు కొట్టారు. బొమ్మనహల్ నుంచి నేమకల్లు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వరకు తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు పాదయాత్ర నిర్వహించారు. సుమారు 8 కిలోమీటర్ల మేర సాగిన పాదయాత్రలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


విజయవాడలో కామధేను అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి 101 కొబ్బరికాయలు కొట్టారు. పోరంకి, సీతాపురం కాలనీలో మహిళలు కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా పెదపూడి మండలం సంపర గ్రామంలో మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి బాబుతో నేను కరపత్రాలను పంపిణీ చేశారు. విశాఖ జిల్లా భీమునిపట్నంలోని టీడీపీ కార్యాలయం వద్ద దీక్షలు కొనసాగాయి. విజయనగరం జిల్లా చీపురుపల్లిలో దీక్షల్లో పెద్దఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. దుప్పాడలో తెలుగు మహిళా విభాగం ఆధ్వర్యంలో పైడితల్లి అమ్మవారికి పూజలు నిర్వహించారు. అమ్మవారికి బోనాలు సమర్పించారు. శ్రీకాకుళంలో తెదేపా కార్యాలయం నుంచి అంబేడ్కర్‌ కూడలి వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. పోలీసులు అడ్డంకులు సృష్టించినా టీడీపీ నేతలు కలసికట్టుగా ర్యాలీని విజయవంతం చేశారు.

చంద్రబాబుకు మద్దతుగా సత్యసాయి జిల్లా హిందూపురంలో సగర ఉప్పర సంఘం సభ్యులు అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చుని ఆందోళన చేపట్టారు. కర్నూలు జిల్లా మంత్రాలయంలో భారీ ర్యాలీ చేశారు. నంద్యాలలో దీక్షా శిబిరాన్ని తెదేపా నాయీ బ్రాహ్మణ సంఘం నాయకులు సందర్శించి సన్నాయి వాయించి నిరసన తెలిపారు. తిరుపతిలో నిర్వహించిన ర్యాలీలో టీడీపీ, జనసేన, వామపక్ష పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. గుంటూరు జిల్లా తెనాలిలో టీడీపీ బీసీ నేతలు వృత్తి పనిముట్లతో నిరసన తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story