CBN: క్లీన్‌ స్వీప్ ఖాయం

CBN: క్లీన్‌ స్వీప్ ఖాయం
రైతులను అన్ని విధాలా ఆదుకుంటాం...ఉత్తరాంధ్రకు అసలు జగన్‌ ఏం చేశాడో చెప్పాలన్న చంద్రబాబు

శ్రీకాకుళం జిల్లా పాతపట్నంలో ప్రజాగళం సభ నిర్వహించిన చంద్రబాబు ఎన్నికల్లో NDA కూటమి ఉత్తరాంధ్రలో క్లీన్ స్వీప్ చేస్తుందని ధీమా వ్యక్తంచేశారు. తాము అధికారంలోకి వచ్చాక రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. గిట్టుబాటు ధర, పంటలబీమా అమలు, రాయితీపై వ్యవసాయ యంత్రాలు, పరికరాలు అందిస్తామని చెప్పారు. వ్యవసాయంలో ఆధునిక సాగు విధానాలు తెచ్చి ఖర్చులు తగ్గిస్తామని భరోసా ఇచ్చారు. దేశంలో ఎక్కడ చూసినా శ్రీకాకుళం జిల్లా కార్మికులు ఉంటారన్న చంద్రబాబు తాము అధికారంలోకి వచ్చాక స్థానికంగానే ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. ఇంటిపన్నులు నియంత్రిస్తామని హామీ ఇచ్చారు. కూటమి గెలుపు కోసం పనిచేయాలని యువతను కోరారు. ఉద్యోగుల పెండింగ్ బకాయిలు చెల్లిస్తామన్న చంద్రబాబు పింఛన్ల విషయంలో శవ రాజకీయాలు చేయవద్దని ప్రభుత్వానికి సూచించారు. పాతపట్నంలోని గిరిజనుల కోసం ఐటీడీఏ, మహిళా డిగ్రీ, పాలిటెక్నిక్‍ కళాశాల ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.


ఉత్తరాంధ్రకు జగన్‌ ఏం చేశాడో చెప్పాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో నిర్వహించిన ప్రజాగళం సభలో ఆయన ప్రసంగించారు. ‘‘స్థానిక ఎమ్మెల్యే అవినీతిపరుడు.. ఆమదాలవలసను పూర్తిగా ఊడ్చేశాడు. నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా ఆ ఇంట్లో వారికి కానుకలు సమర్పించాలి. నాగావళి, వంశధార ఇసుక విశాఖపట్నం వెళ్తోంది. ఇలాంటి వ్యక్తిని ఎప్పుడూ చూడలేదు. నా దృష్టిలో పడ్డవారిని నేనంత ఈజీగా వదిలిపెట్టను. రూ.10 ఇచ్చి వందరూపాయలు దోచుకునే వ్యక్తి జగన్‌. గుంటూరుకు చెందిన లక్ష్మి అనే మహిళ వైసీపీ అరాచకాలను దేశం దృష్టికి తీసుకురావాలని ఢిల్లీ వెళ్లి బొటనవేలు కట్ చేసుకునే పరిస్థితి వచ్చిందని చంద్రబాబు అన్నారు.

జగన్‌ లాంటి వ్యక్తి సీఎంగా ఉంటే మహిళలకు రక్షణ ఉంటుందా?చిరంజీవి, రాజమౌళి లాంటి వారిని కూడా జగన్‌ అవమానించారు. జగన్‌ ఒక విధ్వంసకారి. రూ.13లక్షల కోట్లు అప్పు చేశారు. దేశంలో ఎక్కువ అప్పులు ఉండే రాష్ట్రం ఏపీనే. అప్పులు ఎక్కువ ఉన్న రైతులు కూడా మన రాష్ట్రంలోనే ఉన్నారు. మేం అధికారంలోకి రాగానే పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తాం, పంటల బీమా అమలు చేస్తాం. ప్రతి ఎకరాకు నీరిస్తాం. వ్యవసాయ రంగంలో సాంకేతికతను తీసుకువస్తాం. అధికారంలోకి వచ్చిన వెంటనే చెత్తపన్ను రద్దు చేస్తాం’’ అని చంద్రబాబు హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story