CBN: తిక్కలోడికి ఓటేశారు... రాజధాని లేకుండా చేశారు

CBN: తిక్కలోడికి ఓటేశారు... రాజధాని లేకుండా చేశారు
జగన్ లాంటి రాక్షసులు వచ్చినా అమరావతిని అంగుళం కదల్చలేరు... ప్రజాగళం సభలో చంద్రబాబు విమర్శలు

అమరావతి ప్రాంతంలోని తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో నిర్వహించిన ప్రజాగళం సభలో పాల్గొన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు మూడు రాజధానుల పేరుతో సీఎం జగన్‌ ఐదేళ్లు మూడు ముక్కల ఆట ఆడారని ధ్వజమెత్తారు. అమరావతి రాజధాని అనేది ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష అని తెలిపారు. విశాఖను ఆర్థిక రాజధాని చేస్తామని కర్నూలును అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ప్రపంచ దేశాలన్నీ అమరావతి వైపు చూసేలా, ప్రణాళికలు సిద్ధం చేశామని చంద్రబాబు వివరించారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్లిందని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారంలోకి వచ్చాక ప్రజావేదిక తిరిగి నిర్మిస్తామన్నా ఆయన జూన్ 4న జగనాసుర వధ తప్పదన్నారు. వైసీపీ పాలనలో అన్నివిధాలుగా నాశనమైన రాష్ట్రాన్ని బాగుచేయటం చాలా కష్టమన్న చంద్రబాబు.. సంకల్పం తీసుకుని బాగుచేసేందుకు తాను సిద్ధమని తెలిపారు. విజన్ ఉన్న నాయకులతోనే అభివృద్ధి సాధ్యమని చంద్రబాబు స్పష్టం చేశారు.


2019 ఎన్నికల్లో ప్రజలు తిక్కలోడికి ఓటేస్తే ఏపీకి రాజధాని లేకుండా చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్‌ లాంటి రాక్షసులు వెయ్యి మంది వచ్చినా అమరావతిని అంగుళం కూడా కదల్చలేరన్నారు. ఈ ప్రాంత రైతులు, మహిళల పోరాటం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందని కొనియాడారు. ‘‘రాజధాని కోసం 29వేల మంది రైతులు 35వేల ఎకరాలు ఇచ్చారు. రాజధానికి కేంద్రం కూడా సహకరించింది. అమరావతిని కూడా హైదరాబాద్‌లా మారుద్దామని ప్రణాళికలు వేశాం. విజయవాడ, గుంటూరుతో కలిపి ఆదర్శ రాజధాని చేయాలనుకున్నాం. ప్రపంచదేశాలన్నీ అమరావతి వైపు చూడాలని ఆలోచించా. సంపద సృష్టించే కేంద్రంగా తయారుచేయాలనుకున్నా. జగన్‌ వచ్చాక రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని మార్చేశారు. ఉపాధి కోసం యువత పక్క రాష్ట్రాలకు వెళ్తున్నారు. రాజధాని అంటే పెద్ద పెద్ద భవనాలు కాదు.. ఆంధ్రుల ఆత్మగౌరవం, ఆత్మ విశ్వాసం. మూడు రాజధానుల పేరుతో మూడు ముక్కలాట ఆడుతూ తమాషాలు చేస్తున్నారు. అమరావతిని ఎవరూ కూడా ఇక్కడి నుంచి కదల్చలేరు. అసాధ్యాన్ని.. సుసాధ్యం చేయడమే తెలుగుదేశం పార్టీ సత్తా. మన రాజధాని అమరావతే. విశాఖపట్నం, కర్నూలును అభివృద్ధి చేస్తాం. గోదావరి జిల్లాలు గర్జిస్తున్నాయి.. ఆ జిల్లాల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా వచ్చే పరిస్థితి లేదని చంద్రబాబు మండిపడ్డారు.

వైసీపీ ఐదేళ్ల పాలనలో రాష్ట్రం 30ఏళ్లు వెనక్కి వెళ్లిందని చంద్రబాబు మండిపడ్డారు. జాబ్‌ క్యాలెండర్‌, మెగా డీఎస్సీ అని నిరుద్యోగులను మోసం చేశారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని జగన్‌ మోసం చేశారని మండిపడ్డారు.. ఏ ముఖ్యమంత్రి అయినా మంచి పనితో పాలన ప్రారంభిస్తారు. కానీ, రూ. 10కోట్లతో కట్టిన ప్రజావేదిక కూల్చివేసి దుర్మార్గుడు పాలన ప్రారంభించారని బాబు గుర్తు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story