CBN: జగన్‌ కబంధ హస్తాల నుంచి ఏపీని కాపాడుకుందాం

CBN: జగన్‌ కబంధ హస్తాల నుంచి ఏపీని కాపాడుకుందాం
ప్రజలకు చంద్రబాబు పిలుపు... తణుకులో పవన్‌కల్యాణ్‌తో కలిసి ప్రచారం

జగన్ కబంధ హస్తాల నుంచి ఆంధ్రప్రదేశ్ ను కాపాడుకోవాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. వైసీపీ పాలనలో ఆంధ్రప్రదేశ్‌ వెంటిలేటర్ పైకి వెళ్లిందన్న ఆయన అధికారం ఇస్తే NDA కూటమి ఆక్సిజన్ గా పనిచేస్తుందని సూచించారు. దగాపడిన ఆంధ్రప్రదేశ్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు ప్రజలు కలిసి రావాలని కోరారు. 30 రోజులపాటు ప్రజలు రాష్ట్రం కోసం పనిచేస్తే... ఐదేళ్లపాటు వారి కోసం తాము పనిచేస్తామని పేర్కొన్నారు. ప్రజాగళం కార్యక్రమంలో భాగంగా తణుకులో తెలుగుదేశం అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్ సంయుక్తంగా రోడ్‌ షో నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన మూడు పార్టీల కార్యకర్తలను ఉద్దేశించి ఉత్సాహంగా ప్రసంగించిన చంద్రబాబు కూటమి అధికారంలోకి వస్తే సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేయడం సహా మెగా డిఎస్సీ వేస్తామని ప్రకటించారు.


గత ఐదేళ్లలో జగన్‌ సర్కారు సృష్టించిన విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకునేందుకే కూటమిగా ఏర్పడినట్లు పునరుద్ఘాటించారు. ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి ప్రజల చేతుల్లోనే ఉందన్న చంద్రబాబు ఎలాంటి పాలన కావాలో నిర్ణయించుకునే సమయం ఆసన్నమైందని పేర్కొన్నారు. ప్రజలు నెలరోజులు రాష్ట్రం కోసం పనిచేస్తే....... తాము ఐదేళ్లు వారి కోసం పనిచేస్తామని చంద్రబాబు వివరించారు. స్థానిక MLA, మంత్రి కారుమూరి నాగేశ్వరరావుపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకొని విపరీతంగా దోచుకున్నారని ఆరోపించారు.


సుఖవంతమైన సినిమా జీవితాన్ని వదులకుని.. ప్రజల కోసం నిలబడిన నిజమైన హీరో పవన్‌ కల్యాణ్ అని చంద్రబాబు అభినందించారు.‘‘నాకు అనుభవం ఉంది.. పవన్‌కు పవర్‌ ఉంది. అగ్నికి వాయువు తోడైనట్లు... ప్రజాగళానికి వారాహి తోడైంది. అహంకారాన్ని బూడిద చేస్తుంది. రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి 3 పార్టీలు కలిశాయి. సైకిల్‌ స్పీడ్‌కు తిరుగులేదు.. గ్లాస్‌ జోరుకు ఎదురు లేదు. వచ్చే ఎన్నికల్లో వైకాపా కొట్టుకుపోవడం ఖాయం. వ్యక్తిగత దాడులు తట్టుకుని పవన్‌ నిలబడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదని మొదట చెప్పిన వ్యక్తి ఆయనే. చీకటి పాలన అంతానికి ఓటు చీలకూడదని చెప్పారు. యువత కన్నెర్ర చేస్తే జగన్‌ లండన్‌ పారిపోతాడు. విధ్వంస పాలన కావాలా? అభివృద్ధి పాలన కావాలో ప్రజలు ఆలోచించాలి. రాష్ట్రాన్ని విధ్వంసం చేసి.. అప్పుల పాలు చేశారు. రాష్ట్రానికి కేంద్రం మద్దతు అవసరం. కేంద్ర మద్దతుతో శిథిల రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలుగుతాం. రైతును రాజుగా చేసే బాధ్యత నాది. రైతులకు గోనె సంచులు కూడా ఇవ్వలేని పౌరసరఫరాలశాఖ మంత్రి తణుకులో ఉన్నారు. అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీపైనే మొదటి సంతకం చేస్తానని చంద్రబాబు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story