PROTEST: ధర్మాగ్రహ దీక్షతో కదం తొక్కిన గుంటూరు

PROTEST: ధర్మాగ్రహ దీక్షతో కదం తొక్కిన గుంటూరు
చంద్రబాబుకు మద్దతుగా భారీ నిరసన ర్యాలీ.. అడుగడుగునా పోలీసుల ఆంక్షలు.. అయినా లెక్కచేయని ప్రజలు...

మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం అధినేత చంద్రబాబు అరెస్టుకు నిరసనగా గుంటూరులో తెలుగుదేశం తలపెట్టిన శాంతిర్యాలీపై పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించినా పార్టీ శ్రేణులు పట్టుదలతో విజయవంతం చేశాయి. ఖాకీల నిర్బంధకాండకు ఎదురొడ్డి నిరసన యాత్ర నిర్వహించారు. ముందుగా ప్రకటించినట్లే లాడ్జి సెంటర్ నుంచి హిమని సర్కిల్ గాంధీ విగ్రహం వరకూ ర్యాలీగా వెళ్లి గాంధీజీకి నివాళి అర్పించారు. జనసేన, CPI కూడా శాంతిర్యాలీలో భాగమయ్యాయి. రాజకీయ పక్షాలకు తోడు ప్రజాసంఘాలు, వృత్తి నిపుణులు, రాజధాని రైతులు పాల్గొన్నారు. పోలీసులు ఉదయం నుంచే ఉక్కుపాదం మోపినా... ర్యాలీకి వస్తే కేసులు తప్పవంటూ... హెచ్చరించినా..గృహ నిర్బంధాలు చేసినా శాంతి ర్యాలీ నిర్వహించారు.


పోలీసులు ఎన్ని ఆంక్షలు విధించినా, గృహ నిర్బంధాలు చేసినా..టీడీపీ నాయకులు, కార్యకర్తలు లెక్కచేయలేదు. మహిళలు, అమరావతి రైతులు, నగర ప్రజలు, వివిధ వర్గాలకు చెందిన ప్రతినిధులు జత కలిశారు. అనుకున్న సమయానికే అందరూ వేర్వేరు మార్గాల్లో లాడ్జ్‌ సెంటర్‌కు చేరుకుని ర్యాలీ ప్రారంభించారు. ర్యాలీ ప్రారంభమైన క్షణం నుంచే......పోలీసులు బారికేడ్లు పెట్టి నిలువరించే ప్రయత్నం చేశారు. అంబేడ్కర్‌ కూడలి నుంచి శంకర్‌విలాస్‌ వంతెన వద్దకు ర్యాలీ చేరుకోగానే రోప్‌లు, బారికేడ్లతో కాసేపు పోలీసులు అడ్డుకున్నారు. బ్రాడీపేట, అరండల్‌పేట వీధుల్లో నుంచి భారీగా జనం ర్యాలీలో కలవడంతో ఆపడం పోలీసులకు సాధ్యం కాలేదు. అక్కడినుంచి వంతెన మీదుగా ర్యాలీ సాగింది. జీజీహెచ్‌ వద్ద మరోసారి పోలీసులు ఆపేందుకు విఫలయత్నం చేశారు. ర్యాలీ హిందూ కళాశాల కూడలి, కార్పొరేషన్‌ మీదుగా హిమనీ సెంటర్‌లోని గాంధీ విగ్రహం వద్దకు చేరుకుంది. ఈ క్రమంలో పాతగుంటూరు నుంచి మైనారిటీలు భారీగా జత కలిశారు.


నిరసన తెలుపుతున్న వారిని బలవంతంగా బస్సుల్లో ఎక్కించి తరలించారు. పోలీసుల ఆంక్షలు, అడ్డంకుల మధ్యే.. భారీగా తరలివచ్చిన నేతలు, కార్యకర్తలు లక్ష్యం దిశగా సాగారు. మార్గమధ్యలో అడ్డుగా పెట్టిన బారికేడ్లను తోసుకుంటూ ముందుకెళ్లారు. ఒకవైపు పోలీసులు అరెస్టు చేస్తున్నా... కార్యకర్తలు, మహిళలు, ప్రజలు వెనక్కి తగ్గలేదు. హిమనీ సర్కిల్‌ వైపు పరుగులు తీశారు. అక్కడికి చేరుకుని..గాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. హిమనీ సెంటర్‌ వద్ద పోలీసుల తోపులాటలో జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌ కొంత అస్వస్థతకు గురయ్యారు. మాజీ మంత్రులు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, నక్కా ఆనందబాబు, గుంటూరు, పల్నాడు జిల్లాల తెదేపా అధ్యక్షులు తెనాలి శ్రావణ్‌కుమార్‌, జీవీ ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యేలు కొమ్మాలపాటి శ్రీధర్‌, ధూళిపాళ్ల నరేంద్రకుమార్‌ పాల్గొన్నారు. పోలీసుల తీరుపై తెలుగుదేశం, జనసేన, సీపీఐ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా మండిపడ్డారు. శాంతియుత పోరాటాల్ని పోలీసులతో అణచివేస్తున్న వైసీపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని.. ర్యాలీలో పాల్గొన్న వివిధ వర్గాల ప్రజలు ధ్వజమెత్తారు.

Tags

Read MoreRead Less
Next Story