NDA: టీడీపీ-జనసేన ప్రచార దూకుడు

NDA: టీడీపీ-జనసేన ప్రచార దూకుడు
ఎన్డీయే కూటమి అభ్యర్థులు ప్రచార దూకుడు... అసంతృప్త నేతల్ని కలుపుకుని ప్రచారం

ఎన్డీయే కూటమి అభ్యర్థులు ప్రచార దూకుడు పెంచారు. ఇంటింటికి వెళ్లి వైసీపీ ప్రభుత్వ వైఫల్యాల్ని వివరిస్తున్నారు. కూటమి అధికారంలోకి రాగానే చేపట్టబోయే పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల్ని తెలియజేస్తూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. అసంతృప్త నేతల్ని కలుపుకుని ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. వైసీపీ పాలనలో నష్టపోయిన బాధితులను అధికారంలోకి రాగానే ఆదుకుంటామని భరోసా కల్పిస్తున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఎన్డీయే అభ్యర్థులు వారి వారి నియోజకవర్గాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. గుంటూరులో టీడీపీ పార్లమెంట్‌ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్‌ తూర్పు అభ్యర్థి నసీర్‌ అహ్మద్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీఆర్‌ స్టేడియంలో మార్నింగ్‌ వాక్‌కు వచ్చిన ప్రజలు, క్రీడా సంఘాల నాయకులతో మాట్లాడారు. లాలాపేట సెంటర్లో పండ్ల దుకాణాల యజమానుల ఇబ్బందుల్ని అడిగి తెలుసుకున్నారు. అధికారంలోకి రాగానే పండ్ల మార్కెట్‌ కోసం కాంప్లెక్స్‌ ఏర్పాటు చేస్తామని వారికి హామీ ఇచ్చారు.


బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి రవికుమార్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆనవాయితీ ప్రకారం అంకమ్మ తల్లి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ టీడీపీ ఆరు గ్యారంటీలను వివరించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. నంద్యాల జిల్లా డోన్ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఆ పార్టీ నేతలు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. డోన్ అభ్యర్థి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి, ధర్మవరం ఇన్‌ఛార్జ్‌ సుబ్బారెడ్డి, బనగానపల్లె అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థి బైరెడ్డి శబరి, జిల్లా అధ్యక్షులు మల్లెల రాజశేఖర్ కార్యక్రమంలో పాల్గొన్నారు. కూటమి గెలుపే లక్ష్యంగా కలిసికట్టుగా పనిచేయాలని నిర్ణయించారు. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డిని గద్దె దించాలని శ్రేణులకు పిలుపునిచ్చారు.


ప్రపంచంలోనే మాదకద్రవ్యాలకు కేరాఫ్ అడ్రస్ గా ఆంధ్రప్రదేశ్‌ను మార్చిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందని అనకాపల్లి నియోజకవర్గ జనసేన అభ్యర్థి కొణతాల రామకృష్ణ అన్నారు. అనకాపల్లిలోని 81 వ వార్డులో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలతో ఆయన సమావేశం నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story