AP: ఓట్ల అవకతవకలపై టీడీపీ ఫిర్యాదు

AP: ఓట్ల అవకతవకలపై టీడీపీ ఫిర్యాదు
అక్రమంగా ఓట్లు తొలగించారని ఎన్నికల అధికారులకు ఫిర్యాదు... ఈసీని కలిసిన వైసీపీ నేతలు....

ఆంధ్రప్రదేశ్ లో శాసనసభ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతపై రెండోరోజు సమీక్షించిన కేంద్ర ఎన్నికల సంఘం బృందం ఓట్ల జాబితా, ఓటర్ల నమోదుకు సంబంధించి విపక్షాల ఫిర్యాదులపై దృష్టి పెట్టింది. ఈ మేరకు ప్రతిపక్షాలు చేసిన ఫిర్యాదులపై ఏం చర్యలు తీసుకున్నారో జిల్లా కలెక్టర్లు, ఎస్పీల నుంచి ఆరా తీసింది. తొలుత.. జిల్లాల వారీ వివరాల సేకరణ చేసిన ఈసీ బృందం తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ, రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై.... రాష్ట్రవ్యాప్త చర్యలపై చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. కేంద్ర ఎన్నికల కమిషన్ సీనియర్ డిప్యూటీ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ వ్యాస్, డిప్యూటీ కమిషనర్ హిర్ధేశ్ కుమార్, డైరెక్టర్ సంతోష్ అజ్మీరా... ఇతర అధికారులు ఏపీలో ఎన్నికల నిర్వహణ, ఓటర్ జాబితా రూపకల్పన సహా అనేక అంశాలపై చర్చించారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఓట్లు అక్రమాలపై ప్రధాన పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం బృందానికి ఫిర్యాదు చేశాయి. తెలుగుదేశం, వైసీపీ, జనసేన నేతలు వేర్వేరుగా వెళ్లి అధికారులను కలిసి. ఓట్ల అక్రమాల్లో వివిధ అంశాలపై ఫిర్యాదు చేశారు. ఎన్నికలు సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.


ఆంధ్రప్రదేశ్ ఓట్ల జాబితాలో అక్రమాలు జరిగాయనితెలుగుదేశం నేతలు కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. విజయవాడలో ఈసీ బృందాన్ని కలిసిన తెలుగుదేశం నేతలు ఏపీలో అక్రమంగా ఓట్లు తొలగించారని ఫిర్యాదు చేసినట్లు వారితో సమావేశం తర్వాత తెలిపారు. అక్రమంగా ఓట్లు తొలగిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని ఈసీ బృందాన్ని కోరినట్లు చెప్పారు. ఫామ్ -7ను ఉపయోగిస్తూ తెలుగుదేశం సానుభూతిపరుల ఓట్లు తొలగించారని పేర్కొన్నారు. వైసీపీ ప్రభుత్వం BLOలనుపార్టీ కార్యక్రమాలకు వాడుకుంటోందని తెలిపారు. అనుభవజ్ఞులైన ప్రభుత్వ ఉపాధ్యాయులను ఎన్నికల విధుల నుంచి తొలగించారని ఈసీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఎన్నికలు సజావుగా జరిగేలా చూస్తామని అధికారులు హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.

ఓట్ల అవకతవకలపై తెలుగుదేశం నేతలు ధూళిపాళ్ల నరేంద్ర, వర్ల రామయ్య, బొండా ఉమామహేశ్వరరావు కేంద్ర ఎన్నిక సంఘం అధికారులకు ఫిర్యాదు చేశారు. వైకాపా నేతలు అక్రమంగా ఓట్లు తొలగిస్తున్నారని... వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం అనుభవజ్ఞులైన టీచర్లని ఎన్నికల విధుల నుంచి తొలగిస్తుందని.... అధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

వైసీపీ నేతలు కూడా కేంద్ర ఎన్నికల సంఘ అధికారులను కలిశారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసిన వాళ్ల ఓట్లను ఆంధ్రప్రదేశ్ లో తొలగించాలని వైసీపీ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈసీ బృందాన్ని కలిసిన వైసీపీ నేతలు తెలంగాణలో ఓటు వేసిన కొందరు మళ్ళీ ఏపీలో ఓటు నమోదు చేసుకుంటున్నట్లు ఈసీకి తెలిపారు. ఇది నేరపూరిత చర్యగా పరిగణించి వెంటనే వారిపై తగిన చర్యలు తీసుకోవాలని కోరినట్లు వెల్లడించారు.

Tags

Read MoreRead Less
Next Story