TDP PROTEST: మోత మోగిపోయింది

TDP PROTEST: మోత మోగిపోయింది
టీడీపీ నిరసనతో ప్రతిధ్వనించిన తెలుగు రాష్ట్రాలు... మోత మోగిద్దాం నిరసనకు భారీ స్పందన

తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఆ పార్టీ పిలుపునిచ్చిన మోత మోగిద్దాం కార్యక్రమంతో ఆంధ్రప్రదేశ్‌ మార్మోగిపోయింది. శనివారం సాయంత్రం ఏడింటి నుంచి దాదాపు పదినిమిషాలపాటు ఏపీలోని అన్ని నగరాలు, పట్టణాలు, పల్లెలు ఈలలు, డప్పుల మోతలు, డోలు శబ్దాలు, కంచాలపై గరిటెల శబ్దాలతో ప్రతిధ్వనించాయి. ఎక్కడ చూసినా తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సాధారణ ప్రజలు చిన్నా, పెద్దా కలిసి చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ మోత మోగించారు. తెలంగాణలోని వివిధ జిల్లాల్లోనూ చంద్రబాబుకు సంఘీభావంగా ప్రజలు ‘మోత మోగిద్దాం’ కార్యక్రమంలో పాల్గొన్నారు.


. రాజమండ్రిలో విజిల్ ఊది నారా బ్రాహ్మిణి నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో నారా భువనేశ్వరి మోత మోగించారు. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చౌరస్తాలో టీటీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. ఢిల్లీలో నారా లోకేశ్, ఎంపీ రఘురామకృష్ణంరాజు, ఎంపీ కనకమేడల నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేశారని మండిపడ్డారు. మంగళగిరి టీడీపీ కార్యాలయంలో అచ్చెన్నాయుడు నిరసన తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో సహా వివిధ ప్రాంతాల్లో ప్రజలు సైతం మోత మోగిద్దాం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇప్పటికైనా చంద్రబాబుపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.


రాజమండ్రిలో నారా బ్రాహ్మణి ఆధ్వర్యంలో..... మోత మోగిద్దాం కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. పెద్దఎత్తున తెలుగుదేశం శ్రేణులు తరలిరాగా..విజిల్ మోగిస్తూ డప్పుకొడుతూ భిన్న రూపాల్లో బ్రాహ్మణి నిరసన తెలిపారు. ఆమెతో కలిసి.. తెలుగుదేశం శ్రేణులు ధ్వనులు చేశారు.

గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో..ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో పార్టీ నేతలు మోత మోగించారు. భిన్న రూపాల్లో ధ్వనులు చేస్తూ నిరసనను తెలియజేశారు. చిలకలూరిపేటలో జాతీయ రహదారిపై 500 మందితో మాజీమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నిరసన తెలిపారు. వినుకొండ, సత్తెనపల్లి, తెనాలిలో డప్పులు, ఈలలతో సీనియర్‌ నేతలు, మహిళలు.., పార్టీ శ్రేణులు నిరసన తెలిపారు.


సత్యసాయి జిల్లా ధర్మవరం గాంధీనగర్ సర్కిల్లో తెలుగు మహిళలు ప్లేట్లతో హోరెత్తించారు. సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు లో ఐదు నిమిషాలపాటు రకరకాల ధ్వనులు చేసి నిరసన తెలిపారు.

నెల్లూరు జిల్లావ్యాప్తంగా బాబుతో నేనంటూ తెలుగుదేశం నాయకులు మోత మోగించారు. మాజీ మంత్రి అనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కార్లు, హరన్లు, స్టీలు గిన్నెలతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

Tags

Read MoreRead Less
Next Story