TDP PROTEST: అదే హోరు... నిరసనల జోరు

TDP PROTEST: అదే హోరు... నిరసనల జోరు
చంద్రబాబు అక్రమ అరెస్ట్‌కు నిరసనగా కొనసాగుతున్న ఆందోళనలు

తెలుగుదేశం అధినేత చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బాబు కోసం మేము సైతం అంటూ టీడీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద సంఖ్యలో కదం తొక్కారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని నేతలు మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించటానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ విజయనగరం జిల్లా రాజాంలో టీడీపీ నేతల రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో మౌన ర్యాలీ చేపట్టి చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటూ వినాయకునికి పూజలు చేశారు.


చంద్రబాబుకు మద్దతుగా ఎన్టీఆర్‌ జిల్లా జగ్గయ్యపేటలో టీడీపీ నేతల నిరాహార దీక్షకు సీపీఐ, A.I.Y.F. నాయకులు సంఘీభావం తెలిపారు. విజయవాడలో మాజీ ఎమ్మెల్యే బొండా ఉమ ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు అరగుండుతో నిరసన తెలిపారు. అవనిగడ్డలో జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్‌ ఆధ్వర్యంలో రిలే నిరాహారదీక్షలు చేశారు. తప్పుడు కేసులతో చంద్రబాబుని జైలుకి పంపించి జగన్‌ కుట్రలు పన్నుతున్నారని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. ఎన్టీఆర్‌ జిల్లా తిరువూరులో టీడీపీ శ్రేణుల దీక్షకు రైతు సంఘం నాయకులు మద్దతు ప్రకటించారు.


నెల్లూరులో శాంతియుత ర్యాలీ చేపట్టింది. నగరంలోని రహదారులు జనసంద్రంగా మారాయి. గాంధీ విగ్రహం, అంబేడ్కర్‌ సెంటర్ వరకూ సాగిన ర్యాలీకి జనసేన, సీపీఐ నేతలు సంఘీభావం తెలిపారు. ర్యాలీలో ఎమ్మె‌ల్యేలు కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఆనం రామానారాయణరెడ్డి, మాజీమంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పాల్గొన్నారు. సైకో పోవాలి- సైకిల్ రావాలంటూ నాయకులు, కార్యకర్తలు నినాదాలు చేశారు.శాంతియుతంగా ర్యాలీ చేస్తుంటే పోలీసులు ఎక్కడికక్కడ ఆంక్షలు విధించారని మహిళలు ఆగ్రహం వ్యక్తంచేశారు. చంద్రబాబు అరెస్టు అక్రమమని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.


చంద్రబాబును తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ గుంటూరు జిల్లా పొన్నూరులో N.G రంగా విగ్రహం వద్ద ధూళిపాళ్ల నరేంద్ర కుమార్‌ ఆ‍ధ్వర్యంలో గౌడ సామజిక నేతలు నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని జగన్‌ అన్ని రకాలుగా నాశనం చేశారని... తెనాలిలో తెదేపా, జనసేన, సీపీఐ నేతలు ఉరితాళ్లు బిగించుకుని నిరసన తెలిపారు. తెనాలిలోని రామలింగేశ్వరరావు పేట చైతన్య కాలేజీ నుంచి స్వరాజ్‌ థియేటర్‌ వరకు తెదేపాతో కలిసి వివిధ విద్యార్థి సంఘాలు ర్యాలీ చేశాయి. బాపట్ల జిల్లా అద్దంకిలో తెదేపా శ్రేణులు కళ్లకు గంతలు కట్టుకుని పశుగ్రాసం తింటూ నిరసన తెలిపారు. హిందూపురంలో పోలీసులకు పుష్పగుచ్ఛాలను ఇచ్చి చేతులు జోడించి నమస్కరించారు. అనంతపురంలోని రాంనగర్ కమ్మ భవన్ సమీపంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన తెలిపారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ రిలే నిరాహార దీక్ష చేశారు.


Tags

Read MoreRead Less
Next Story