SUPREME COURT: సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌

SUPREME COURT: సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్‌
ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేసిన చంద్రబాబు.... క్వాష్‌ పిటిషన్‌ కొట్టేయాలని వ్యాజ్యం

క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేస్తూ ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు ఇచ్చిన తీర్పుని సవాలు చేస్తూ తెలుగు దేశం అధినేత చంద్రబాబునాయుడు సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. క్వాష్‌ పిటిషన్‌ను కొట్టేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా తనని అరెస్టు చేసినట్లు పిటిషన్‌లో తెలిపారు. వాస్తవాలను హైకోర్టు వక్రీకరించిందని పేర్కొన్నారు. 20 నెలల క్రితం ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినా అకస్మాత్తుగా, చట్టవిరుద్ధంగా అరెస్టు చేశారన్నారు. వ్యతిరేకంగా సాక్ష్యాలు లేకపోయినా రాజకీయ కారణాలతో అదుపులోకి తీసుకున్నారని పిటిషన్‌లో చంద్రబాబు తెలిపారు. చట్టవిరుద్ధంగా, దురుద్దేశపూర్వకంగా జరుగుతున్న దర్యాప్తుతో తనని ఇబ్బందులకు గురిచేస్తున్నారని, అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘన కిందికి వస్తుందని పిటిషన్‌లో ప్రస్తావించారు.

ఇప్పటివరకూ అవినీతి నిరోధక చట్టం-1988లోని సెక్షన్‌ 17ఎ కింద చట్టబద్ధమైన అనుమతి తీసుకోనందున ఎఫ్‌ఐఆర్‌ నమోదుచేయడం, దాని ఆధారంగా దర్యాప్తు చేపట్టడం చెల్లుబాటు కావని పేర్కొన్నారు. సెక్షన్‌ 17ఎ కింద ముందస్తు అనుమతి తప్పనిసరి అని స్టేట్‌ ఆఫ్‌ హరియాణా వర్సెస్‌ భజన్‌లాల్, యశ్వంత్‌సిన్హా వర్సెస్‌ సీబీఐ, స్టేట్‌ ఆఫ్‌ రాజస్థాన్‌ వర్సెస్‌ తేజ్‌మల్‌ చౌధరి కేసుల్లో సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. ఆ అనుమతి లేకుండా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడం, అరెస్టు, రిమాండు, ఇతరత్రా చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసిందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు సెక్షన్‌ 17ఎ కింద తీసుకోవాల్సిన ముందస్తు అనుమతులను తప్పుగా అర్థం చేసుకొని దాని ప్రభావాన్ని నీరుగార్చిందని పేర్కొన్నారు.


ఈ కేసును ప్రధానంగా 17-ఎ కింద సవాలు చేస్తే ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు దానిచుట్టూ రకరకాల వాదనలను నమోదుచేసిందని పిటిషన్‌లో ప్రస్తావించారు. ఆ సెక్షన్‌ వర్తింపునకు మినహాయింపులు సృష్టించిందని, వాస్తవానికి అలాంటివేమీ చట్టంలో లేవని తెలిపారు. సెక్షన్‌ 482 సీఆర్‌పీసీ జ్యూరిస్‌ డిక్షన్‌ను అనుసరించి ఇక్కడ మినీ ట్రయల్‌ అవసరం లేదని ఒకచోట చెప్పిన హైకోర్టు, మరోవైపు కేసు వివరాలను నమోదు చేసిందని తెలిపారు. తద్వారా మినీట్రయల్‌ నిర్వహించడంతో పాటు ఆధారాలేవీ లేకుండానే పిటిషనర్‌ వ్యక్తిగత ప్రయోజనం పొందినట్టు ఏకపక్షంగా వ్యాఖ్యానించిందని పేర్కొన్నారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు, తదనంతరం సీఐడీ పోలీసులు వ్యవహరించిన తీరు, పిటిషనర్‌ను రిమాండుకు ఇవ్వడంలో ఉన్న అవకతవకల గురించి హైకోర్టు చూడలేదని అందువల్ల తీర్పు చెల్లదని... పిటిషన్‌లో తెలిపారు.

2018 జూన్‌ 5న రెగ్యులర్‌ ఎంక్వయిరీకి ఆర్డర్‌ చేసినట్లు హైకోర్టు తన తీర్పులోని పేరా 16లో పేర్కొనడం అసంబద్ధమని వాస్తవానికి అది నిజం కూడా కాదని తెలిపారు. రికార్డుల్లోని అంశాలకు విరుద్ధమని సెక్షన్‌ 17ఎ నిబంధనను తప్పించుకోవడానికి కొత్తగా చేసిన ఆలోచన అని పేర్కొన్నారు. NSG జడ్‌+ సెక్యూరిటీలో ఉన్న తనని ఆర్టికల్‌ 222, సీఆర్‌పీసీ సెక్షన్‌ 167 ప్రకారం సమీపంలోని మేజిస్ట్రేట్‌ ముందు హాజరుపరచకుండా...... రోడ్డుమార్గంలో 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు విజయవాడలోని సీఐడీ ఆఫీసుకు తీసుకెళ్లారని తెలిపారు. కేసును చంద్రబాబు తరఫు న్యాయవాదులు సోమవారం సీజేఐ ధర్మాసనం ముందు మెన్షన్‌ చేసే అవకాశం ఉంది. ఆ ధర్మాసనం ఇచ్చే ఉత్తర్వుల ఆధారంగా తదుపరి విచారణ ప్రక్రియ సాగుతుంది.

Tags

Read MoreRead Less
Next Story