TDP: సజ్జలపై ఈసీకి ఫిర్యాదు

TDP: సజ్జలపై ఈసీకి ఫిర్యాదు
వైసీపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారని ఫిర్యాదు.. ఎన్నికల కోడ్ ఉల్లంఘించారన్న అచ్చెన్న

సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ సలహాదారుడిగా కాకుండా... వైసీపీ కార్యకర్తలా మాట్లాడుతున్నారని....... తెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు దుయ్యబట్టారు. ప్రభుత్వ ఖజానా ఖర్చుతో.. వైసీపీ పార్టీ పనులు చేస్తున్నారని ఆక్షేపించారు. ఈ మేరకు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఎన్నికల సంఘానికి అచ్చెన్నాయుడు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తూ... మార్చి 18, 22న ప్రెస్ మీట్ లు పెట్టి ప్రతిపక్షాలపై బహిరంగ ఆరోపణలు చేశారని సీఈవోకు లేఖ రాశారు. ఎన్నికల నియమావళికి విరుద్ధంగా వైసీపీ అభ్యర్ధులతో సజ్జల భేటీలు, వీడియో కాన్ఫరెన్సులు నిర్వహిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించినందుకు సజ్జలపై కఠిన చర్యలు తీసుకోవాలన్న అచ్చెన్న.... ప్రభుత్వ సలహాదారు పదవి నుంచి అతన్ని తొలగించాలని డిమాండ్ చేశారు.


రాజకీయ ప్రయోజనాల కోసం జగన్ సమాజంలో చీలిక తెస్తున్నారని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ధ్వజమెత్తారు. తాడేపల్లిలో వివిధ అపార్ట్ మెంట్ల నివాసితులతో లోకేష్ సమావేశం నిర్వహించారు. జగన్ దృష్టంతా అవినీతి సంపాదనపై తప్ప అభివృద్ధి, ఉద్యోగాల కల్పనపై లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు నేతృత్వంలో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆగిపోయిన చోట నుంచే అమరావతి పనులు ప్రారంభిస్తామని స్పష్టంచేశారు. అధికారంలోకి రాగానే యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. పోలీసు శాఖలోని ఖాళీలన్నీ భర్తీ చేసేలా... చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఎవరు ఎక్కువ ఉద్యోగాలు కల్పిస్తారో... అలాంటి పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహిస్తామన్నారు. జగన్ ఆస్తుల కంటే ఆయనపై కేసులే ఎక్కువని ఎద్దేవా చేశారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలని అందుకే ఏపీలో 160 అసెంబ్లీ, 24 లోక్‌సభ స్థానాల్లో NDAను గెలిపించాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు కోరారు. తమ పాలనలో హింసా, దౌర్జన్యాలకు తావుండదని స్పష్టంచేశారు. కుప్పంలో పర్యటించిన చంద్రబాబు సంపద సృష్టించి, దాన్ని మహిళలకే పంచుతామని హామీ ఇచ్చారు. వైకాపా నేతల భూదాహానికే సుబ్బారావు కుటుంబం బలైపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంతో మంది ఇలా బాధలు పడుతున్నారని చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story