ప్రతిష్టాత్మకంగా మారిన తిరుపతి ఎంపి ఉపఎన్నిక

ప్రతిష్టాత్మకంగా మారిన తిరుపతి ఎంపి ఉపఎన్నిక
తిరుపతి ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ కొట్టొచ్చినట్లు కనబడుతోంది.

తిరుపతి పేరువినగానే మొదటగా గుర్తుకువచ్చేది వేంకటేశ్వరస్వామి. తిరుపతి ప్రత్యేకత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇంతటి ప్రశాసస్తం ఉన్న తిరుపతిలో ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తికి పలుకుబడి, పరిచయాలు ఎక్కువగానే ఉంటాయి. ప్రపంచ నలుమూలల నుంచి అధికసంఖ్యలో భక్తులే కాదు ప్రముఖులూ ఇక్కడికి వస్తుంటారు. అందుకే తిరుపతిలో ప్రజాప్రతినిధిగా ఉండేందుకు నేతలంతా పోటీ పడుతుంటారు. ఇక ఎంపి స్థానమంటే చెప్పనక్కర్లేదు. గతంలో వైసీపీ ఎంపి బల్లి దుర్గాప్రసాద్ కరోనాతో గత ఏడాది సెప్టెంబర్ 16న మరణించారు. దీంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఎన్నికకు నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభమైంది. ఈ నెల 30 వరకు నామినేషన్లు దాఖలు చేసుకోవచ్చు. ఈ నెల 31న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. ఆ తరువాత ఏప్రిల్‌ 1న ఉపసంహరణ ఉంటుంది. ఏప్రిల్ 17న పోలింగ్‌, మే 2వతేదీ కౌంటింగ్, ఫలితాలు వెలువడనున్నాయి.

తిరుపతి పార్లమెంటు పరిధిలోకి మొత్తం ఏడు నియోజకవర్గాలు వస్తాయి. చిత్తూరుజిల్లాలో మూడు నియోజకవర్గాలు, నెల్లూరుజిల్లాలో నాలుగు నియోజకవర్గాలు వస్తాయి. తిరుపతి పార్లమెంటు ఎస్సి రిజర్వేషన్. చిత్తూరుజిల్లాలో తిరుపతి, శ్రీకాళహస్తి, సత్యవేడు నియోజకవర్గాలు రాగా, నెల్లూరుజిల్లాలో సర్వేపల్లి, గూడూరు, సూళ్ళూరుపేట, వెంకటగిరి నియోజకవర్గాలు వస్తాయి. ఏడు నియోజకవర్గాల్లో సుమారుగా 15లక్షలమంది ఓటర్లు ఉన్నారు. తిరుపతి పార్లమెంటు రాజకీయ ముఖ చిత్రాన్ని చూస్తే చింతామోహన్ 5 సార్లు ఎంపిగా సుధీర్ఘకాలం పనిచేశారు. కాంగ్రెస్ నుంచి అతి ఎక్కువసార్లు తిరుపతి ఎంపిగా కొనసాగిన వ్యక్తి ఈయనే. ఈ ఉప ఎన్నికల్లోనూ కాంగ్రెస్ తరపున బరిలో నిలిచారు. అంతేకాదు ఇప్పటికే ఈయన ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించారు.

ఈ ఉపఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది టీడీపీ. అందుకే నోటిఫికేషన్ ప్రకటించకముందే అభ్యర్థిని ప్రకటించింది. టీడీపీ తరపున గతంలో పోటీ చేసి ఓడిపోయిన పనబాక లక్ష్మికే ఆ సీటును కేటాయించారు అధినేత చంద్రబాబునాయుడు. అంతేకాదు... టీడీపి నాయకులంతా నియోజకవర్గాల వారీగా ఉప ఎన్నిక సన్నాహక సమావేశాలను నిర్వహించుకుంటున్నారు. టీడీపీ సీనియర్ నేతలు యనమలరామక్రిష్ణుడు, బుద్ధావెంకన్న, మాజీ మంత్రి అమరనాథరెడ్డిలతో పాటు సీనియర్ నేతలందరూ ఇప్పటికే తిరుపతిలో ఉండి సమావేశాలకు హాజరవుతున్నారు.

ఇక వైసీపీ నుంచి వైద్యుడు గురుమూర్తి పేరును ఖరారు చేశారు. గురుమూర్తి రాజకీయాలకు కొత్త ముఖం. మొదటిసారిగా తిరుపతి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారాయన. ఫిజియోథెరపిస్ట్ గా ఉన్న గురుమూర్తి సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు. ఫ్యామిలీ డాక్టర్‌గా జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. దీంతో తిరుపతి ఎంపి సీటును గురుమూర్తికే కేటాయించారు. అయితే ఇప్పటి వరకు గురుమూర్తి ప్రచారాన్ని ప్రారంభించలేదు.

ఉప ఎన్నికల్లో స్పెషల్ అట్రాక్షన్ బీజేపి! కమలనాథులు ఇప్పటికే తిరుపతిలో మకాం వేశారు. రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్సి సునీల్ థియోధర్ , బీజేపి నేత విష్ణువర్ధన్ రెడ్డిలతో పాటు ముఖ్య నేతలందరూ వారంరోజులుగా తిరుపతిలోనే ఉంటూ కార్యకర్తలతో సమన్వయ సమావేశాలను నిర్వహిస్తున్నారు. నియోజకవర్గాల వారీగా నేతలందరినీ పిలిపించుకుని ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చిస్తున్నారు. అయితే మొదట్లో బీజేపీ-జనసేన ఉమ్మడి అభ్యర్థి అంటూ అభ్యర్థి పేరును ఖరారు చేయడంలో ఆలస్యం చేశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను ఒప్పించి చివరకు బీజేపీ అభ్యర్థినే బరిలోకి దింపేందుకు సిద్థమయ్యారు. కానీ అభ్యర్థి పేరును మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. తిరుపతిలో జరిగిన అభివృద్థి మొత్తం కేంద్రప్రభుత్వమే చేసిందని...తిరుపతిని మరింతగా అభివృద్థి చేయాలంటే అది బిజెపితోనే సాధ్యమంటూ చెబుతున్నారు కమలనాథులు. వైసిపినే టార్గెట్ చేస్తూ బీజేపి నేతల సమావేశాలు కొనసాగుతున్నాయి.

తిరుపతి ఉప ఎన్నిక చూస్తుంటే ప్రధాన ఎన్నికను తలపిస్తోంది. నువ్వా నేనా అన్నట్లుగా మూడూ ప్రధాన పార్టీలు గెలుపు వ్యూహాలతో ఢీకొంటున్నాయి. తిరుపతి ఉప ఎన్నికలో త్రిముఖ పోటీ కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ప్రధాన పార్టీలైన టీడీపి, వైసిపిలకు ధీటుగా బీజెపి కూడా ఎన్నికల కదనరంగంలోకి దిగుతోంది. మరి ఈ ఎన్నికల్లో ఓటర్లు ఎవరివైపు ఉన్నారన్నది చూడాలి.

Tags

Read MoreRead Less
Next Story