ACB COURT: చంద్రబాబును కస్టడీకి ఇవ్వద్దు

ACB COURT: చంద్రబాబును కస్టడీకి ఇవ్వద్దు
సీఐడీ పిటిషన్‌ను తోసిపుచ్చాలన్న సిద్ధార్థ లూథ్రా... దర్యాప్తు అధికారి దురుద్దేశంతో ఉన్నారని వ్యాఖ్య

ఆంధ్రప్రదేశ్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్ కేసులో ప్రస్తుతం జ్యుడీషియల్‌ రిమాండ్‌లో ఉన్న తెలుగుదేశం అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును అయిదు రోజుల పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ ఏసీబీ కోర్టులో వాదనలు జరిగాయి. ఈ కేసులో చంద్రబాబును విచారించేందుకు ‘పోలీసు కస్టడీ ’కి ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన తరఫున సీనియర్‌ న్యాయవాదులు సిద్ధార్థ లూథ్రా, సిద్ధార్థ అగర్వాల్‌ వాదనలు వినిపించారు. అయిదు రోజుల కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చాలని కోరారు. చంద్రబాబు తరఫున ‘చంద్రబాబుని అరెస్టు చేసి 24గంటల్లో కోర్టుముందు హాజరుపరచాల్సిన దర్యాప్తు అధికారులు, నిబంధనలకు విరుద్ధంగా 36గంటలు వారివద్దే విచారణ నిమిత్తం ఉంచుకున్నారన్నారు.


విచారణకు సంబంధించిన వీడియోలను ఎంపిక చేసుకున్న ఛానళ్లకు లీకులు ఇచ్చారని, అవి ప్రజా బాహుళ్యంలో ఉన్నాయని సిద్ధార్థ లూథ్రా వాదించారు. ఈనెల 10న ఏసీబీ కోర్టులో చంద్రబాబుని హాజరుపరుస్తూ జ్యుడీషియల్‌ రిమాండ్‌కు ఆదేశించాలని కోరారని, ఒక్క రోజులో అలోచనను మార్చుకున్న దర్యాప్తు అధికారి 11వ తేదీన పోలీసు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌ వేశారన్నారు. ఇలా ఒక్కరోజులోనే మాట మార్చడం వెనక దర్యాప్తు అధికారి దురుద్దేశం ఉన్నట్లు స్పష్టమవుతోందన్నారు. చంద్రబాబు ప్రతిష్ఠను దెబ్బతీయడం కోసం పోలీసు కస్టడీకి ఇవ్వాలంటూ కోర్టు అనుమతి కోరుతున్నారన్నారు. ఇప్పటికే సీఐడీ ప్రెస్‌మీట్లు పెట్టిందని చంద్రబాబును ప్రశ్నిస్తున్నట్లు వీడియోలను విడుదల చేసిందన్నారు. ఇలాంటి చర్యలన్నింటికీ సీఐడీ, న్యాయస్థానానికి సమాధానం చెప్పాలన్నారు. కోర్టుతో సీఐడీ ఆటలాడుతోందని పేర్కొన్నారు. ప్రతీకారం తీర్చుకోవడంలో భాగంగా చంద్రబాబుని ఈ కేసులో ఇరికించారని న్యాయవాది అన్నారు. ఆయన పాత్ర ఉంటే 2021 నుంచి దర్యాప్తు చేస్తున్న వారు ఇప్పటి వరకు ఒక్కసారైనా నోటీసు ఇవ్వలేదు, విచారణకు పిలవలేదన్నారు. రాత్రికిరాత్రే ఆయన పేరును నిందితుల జాబితాలో చేర్చి బస్సును చుట్టుముట్టి అరెస్టు చేశారని కోర్టు దృష్టికి తీసుకొచ్చారన్నారు.


నైపుణ్యాభివృద్ధి సంస్థ నిధుల విషయంలో 2021 డిసెంబర్‌ 09న సీఐడీ పలువురిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసిందన్నారు. ఇప్పటి వరకు పలువురిని అరెస్టు చేసిందని తెలిపారు. వారు బెయిలు పొందారని ఇప్పటి వరకు ఇతర నిందితులందరూ దర్యాప్తు సంస్థతోనే ఉన్నారని అన్నారు. దర్యాప్తునకు సహకరించారని..చంద్రబాబుకు వ్యతిరేకంగా ఒక్క సాక్ష్యం కూడా లేదని... అలాంటప్పుడు ఆయనను పోలీసు కస్టడీలో విచారించి తేల్చేదేముంటుందన్నారు.


వాస్తవాలు వెలికితీయాలంటే చంద్రబాబును పోలీసు కస్టడీ విచారణ అవసరమని సీఐడీ తరపు న్యాయవాదులు వాదించారు. ఇరువైపు వాదనలు ముగియగా...నిర్ణయాన్ని ఈ ఉదయం పదకొండు‌న్నర గంటలకు వెల్లడించనున్నట్లు.... అనిశా కోర్టు న్యాయాధికారి బి.సత్య వెంకట హిమబిందు ప్రకటించారు.

Tags

Read MoreRead Less
Next Story