TDP: టీడీపీలోకి ఎంపీ మాగుంట

TDP: టీడీపీలోకి ఎంపీ మాగుంట
ఎన్నికల క్షేత్రంలో మాగుంట రాఘవరెడ్డి.... పొత్తుతో జగన్‌కు చెమటలు పడుతున్నాయన్న లోకేశ్

త్వరలో తాను తెలుగుదేశంలో చేరబోతున్నట్టు ఒంగోలు లోక్ సభసభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి ప్రకటించారు. ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన ఆయనను ఇవాళ ఒంగోలు మాజీ MLA దామచర్ల జనార్ధన్ ఆధ్వర్యంలో తెలుగుదేశం స్థానిక నాయకులు కలిశారు. అంతా కలిసి రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్టు భేటీ తర్వాత మాగుంట చెప్పారు. తెలుగుదేశం అధినాయకత్వం నిర్ణయించే ముహూర్తంలో తాను, తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి సైకిలెక్కుతామని చెప్పారు. ఈసారి తన కుమారుడు రాఘవరెడ్డి ఎన్నికల్లో పోటీ చేస్తారని అందరూ సహకరించాలని కోరారు.


మరోవైపు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తుతో ముఖ్యమంత్రి జగన్‌కు చెమటలు పడుతున్నాయని నారా లోకేశ్‌ అన్నారు. చరిత్ర ఉన్నంత వరకు జగన్‌ ఉంటాడని సీఎం చేసిన వ్యాఖ్యలకు లోకేశ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఐదేళ్ల జగన్‌ పాలనలో ప్రజలపై పన్నుల భారాన్ని మోపి సామాన్యుల నడ్డి విరిచారని ధ్వజమెత్తారు. వైసీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను సీఎం జగన్‌ నెరవేర్చలేదని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. అనంతపురం, తాడిపత్రిలో నిర్వహించిన శంఖారావం సభల్లో పాల్గొన్న లోకేశ్‌... అధికారంలోకి రాగానే టిడ్కో ఇళ్లు పూర్తి చేసి లబ్ధిదారులకు ‌అందిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ కార్యకర్తలపై వెయ్యి అక్రమ కేసులు పెట్టారని.... ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటానని లోకేశ్‌ భరోసా ఇచ్చారు.


అనంతపురం లాంటి కరవు ప్రాంతంలో కార్లు పండించే కియా పరిశ్రమను తీసుకువచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీదని లోకేశ్‌ అన్నారు. తెలుగుదేశం-జనసేన ప్రభుత్వం అధికారంలోకి రాగానే బీసీ డిక్లరేషన్‌ ద్వారా ఆదుకుంటామని లోకేశ్‌ హామీ ఇచ్చారు. చట్టాన్ని ఉల్లంఘించిన వైసీపీ నేతలు, అధికారులపై న్యాయ విచారణ జరిపిస్తామని, తప్పు చేసిన ఎవరినీ వదిలిపెట్టమని లోకేశ్‌ హెచ్చరించారు.

వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం - జనసేన - బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం కొలిక్కి వచ్చింది. పొత్తులో భాగంగా భాజపా - జనసేనకు అదనంగా మరో అసెంబ్లీ స్థానం కేటాయించారు. మొత్తం 31 అసెంబ్లీ, 8 పార్లమెంట్ స్థానాల్లో ఈ రెండు పార్టీలు పోటీ చేయనున్నాయి. వీటిలో 10 అసెంబ్లీ, 6 లోక్‌సభ స్థానాల్లో కమలం పార్టీ.. 21 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల్లో జనసేన బరిలోకి దిగనున్నాయి. మిగిలిన చోట్ల టీడీపీ పోటీ చేయనుంది. ఈ మేరకు ఉండవల్లిలో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నివాసంలో జరిగిన సమావేశంలో.. కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌, జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌, బీజేపీ జాతీయనేత బైజయంత్‌ ఏకాభిప్రాయానికి వచ్చారు. అనంతరం మూడు పార్టీలు ఉమ్మడి ప్రకటన విడుదల చేశాయి.

Tags

Read MoreRead Less
Next Story