AP New Cabinet: ఏపీలో వేగంగా మారిపోతున్న పరిణామాలు.. కొత్త మంత్రులు కొలువుదీరడం ఖాయం..

AP New Cabinet: ఏపీలో వేగంగా మారిపోతున్న పరిణామాలు.. కొత్త మంత్రులు కొలువుదీరడం ఖాయం..
AP New Cabinet: కేబినెట్‌ విస్తరణకు సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆశావహులు బెర్తుల కోసం ఎదురు చూస్తున్నారు.

AP New Cabinet: ఏపీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి.. కేబినెట్‌ విస్తరణకు సీఎం జగన్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఆశావహులు బెర్తుల కోసం ఎదురు చూస్తున్నారు.. సామాజికవర్గాల ఆధారంగా క్యాబినెట్‌లోకి కొత్త నీరు రావడం, పాత నీరు పోవడం జరుగుతుందని చెప్పినప్పటికీ.. జిల్లాల వారీగానూ సమీకరణాలు ఉంటాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీన్నిబట్టి క్యాబినెట్‌ బెర్త్‌పై పలువురు నేతలు ఆశలు పెంచుకుంటున్నారు.

విశాఖ నుంచి అవంతి శ్రీనివాస్‌ మంత్రిగా ఉన్నారు. ఈ స్థానం కోసం గుడివాడ అమర్‌నాథ్, గొల్ల బాబూరావు, ముత్యాల నాయుడు, కరణం ధర్మశ్రీ పోటీపడుతున్నారు. చిత్తూరు జిల్లా నుంచి ఉప ముఖ్యమంత్రిగా నారాయణస్వామి, మంత్రిగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కొనసాగుతున్నారు. వీరిలో ఎవరో ఒకరిని మారుస్తారని గట్టి టాక్ వినిపిస్తోంది. ఎవరిని మార్చినా.. మళ్లీ అదే సామాజికవర్గ నేతకు మాత్రం ఛాన్స్‌ ఇవ్వరని తెలుస్తోంది.

ఉదాహరణకు పెద్దిరెడ్డిని తప్పిస్తే.. ఆ స్థానంలో నగరి ఎమ్మెల్యే రోజారెడ్డిని తీసుకోబోరని చెబుతున్నారు. అయితే చిత్తూరు జిల్లా నుంచి మహిళా కోటాలో రోజాకు అవకాశం దక్కొచ్చని ఆమె వర్గీయులు ఆశాభావంతో ఉన్నారు. వైసీపీ వర్గాలు చెబుతున్న దాని ప్రకారం.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, కొడాలి నాని కొనసాగుతారని అంటున్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్థిక శాఖను తీసుకోడానికి ఎవరూ సాహసం చేయడం లేదట. అందుకే, ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డినే కొనసాగించవచ్చనే చర్చ నడుస్తోంది. ఇక సామాజిక సమీకరణ కోణంలో చూస్తే మంత్రి గుమ్మనూరు జయరాంను కొనసాగిస్తారని చెప్పుకుంటున్నారు. కృష్ణా జిల్లా నుంచి పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌, పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి మధ్య పోటీ నడుస్తోంది.

ఇద్దరూ బీసీ కోటాలో పోటీపడుతున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య పోటీ ఉంది. అయితే, ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లా నుంచి మంత్రిగా ఉన్న కన్నబాబును కొనసాగించే అవకాశాలున్నాయని చెప్పుకుంటున్నారు. అయితే, జక్కంపూడికి జగన్‌ హామీ ఇచ్చారనే చర్చ కూడా జరుగుతోంది. దీంతో తూగో జిల్లాలో ఏ రాజకీయ మార్పులు ఉంటాయోనన్న ఉత్కంఠ నెలకొంది.

ప్రస్తుత జగన్ క్యాబినెట్‌లో కాపు సామాజికవర్గం నుంచి ఐదుగురు మంత్రులు ఉన్నారు. కొత్త మంత్రివర్గంలో చోటు కోసం ఇదే వర్గం నుంచి పోటీ ఎక్కువగా ఉంది. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, తుని ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా, అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌, భీమవరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబు, కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మంత్రి పదవి కోసం పోటీ పడుతున్నారు.

ఇక రెడ్డి సామాజిక వర్గం నుంచి కొత్తగా సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌రెడ్డి, రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి , అనంతపురం నుంచి అనంత వెంకటరామిరెడ్డి, మంగళగిరి నుంచి ఆళ్ల రామకృష్ణారెడ్డి, మాచర్ల నుంచి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే మేడా మల్లికార్జునరెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి, ఆదోని ఎమ్మెల్యే వై.సాయిప్రసాదరెడ్డి, భూమన కరుణాకర్‌రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి, ఆర్‌కే రోజా ప్రధానంగా పోటీలో ఉన్నారు.

వీరిలో కాకాణికి దాదాపు బెర్తు ఖాయమని ప్రచారం జరుగుతోంది. వీరిలో ఆళ్ల, మేడాకు మంత్రి పదవులపై గతంలోనే హామీ ఇచ్చారు జగన్. ఇక బాలనాగిరెడ్డి కుటుంబంలో ముగ్గురు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. కుటుంబంలో ఎవరో ఒకరికి మంత్రి పదవి ఇవ్వాలని వీరు కోరుతున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో బీసీ మంత్రులు ఐదుగురు ఉన్నారు.

ఈ కోటాలో కొత్తగా పోటీ పడుతున్న వారిలో రెడ్డి శాంతి, కరణం ధర్మశ్రీ, కాపు రామచంద్రారెడ్డి, ముత్యాల నాయుడు, ఉషశ్రీ చరణ్‌, కె.పార్థసారథి, జోగి రమేష్‌ ఉన్నారు. మైనారిటీ వర్గం నుంచి హఫీజ్‌ఖాన్‌, ముస్తఫా మధ్య తీవ్ర పోటీ ఉంది. ఎస్టీల్లో పీడిక రాజన్నదొరకు అవకాశమివ్వొచ్చని వైసీపీ వర్గాలు చెబుతున్నారు. ఎమ్మెల్యే కళావతి, భాగ్యలక్ష్మి, ధనలక్ష్మి, ఫల్గుణ కూడా పోటీలో ఉన్నారు.

ఇక బ్రాహ్మణ సామాజికవర్గం నుంచి ఎవరికీ అవకాశం ఇవ్వలేదు. ఈసారి కోన రఘుపతి, మల్లాది విష్ణులో ఒకరికి మంత్రి పదవి రావొచ్చనే చర్చ జరుగుతోంది. ఇక సీనియర్‌ నేతలుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు, ఆనం రామనారాయణరెడ్డికి ఈసారి మంత్రి పదవి దక్కుతుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది.

Tags

Read MoreRead Less
Next Story