Itlu Maredumilli Prajaneekam Review: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం.. డైరెక్టర్: ఏఆర్ మోహన్

Itlu Maredumilli Prajaneekam Review:  ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం..        డైరెక్టర్: ఏఆర్ మోహన్
Itlu Maredumilli Prajaneekam Review: నాగరిక(..?) ప్రపంచానికి దూరంగా.. కనీస సౌకర్యాలు లేని కొండలు, గుట్టలో నివసించే గిరిజనులు.. ఎదుర్కొనే ఇబ్బందులు అన్ని కాలాల్లోనూ చిన్న చిన్న కాలమ్స్ లో పేపర్స్ లో కనిపిస్తుంటాయి.

Itlu Maredumilli Prajaneekam Review: ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం..

తారాగణం: నాంది నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, శ్రీతేజ్, సంపత్ రాజ్

డైరెక్టర్: ఏఆర్ మోహన్

నాగరిక(..?) ప్రపంచానికి దూరంగా.. కనీస సౌకర్యాలు లేని కొండలు, గుట్టలో నివసించే గిరిజనులు.. ఎదుర్కొనే ఇబ్బందులు అన్ని కాలాల్లోనూ చిన్న చిన్న కాలమ్స్ లో పేపర్స్ లో కనిపిస్తుంటాయి. వర్షాకాలంలో అయితే వాగులు వంకలు దాటేందుకు, రోగులు, గర్భిణులతో వారు పడే అవస్థలు వర్ణనాతీతం. ఆ అవస్థలను తొలగించే అవకాశం ప్రభుత్వానికి ఉన్నా చేయదు.


అధికారులూ పట్టించుకోరు. కానీ ఓట్లు వచ్చినప్పుడు మాత్రం వారి అవసరం కనిపిస్తుంది. ఆ కొన్ని రోజులు హామీల మబ్బులు కుమ్మరిస్తారు. ఎన్నికలయ్యాక.. మబ్బులు కరిగిపోతాయి. వారి కడగండ్లు అలాగే ఉంటాయి. ఆ నేపథ్యంలో వచ్చిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా ఎలా ఉందో చూద్దాం.

కథ:

రంపచోడవరం అనే నియోజకవర్గానికి వచ్చిన ఉప ఎన్నికల్లో మారేడుమిల్లి ప్రాంతంలో ఉన్న గిరిజనులతో ఓటు వేయించేందుకు స్పెషల్ ఆఫీసర్ గా వెళతాడు శ్రీనివాస్( నాంది నరేష్‌) అనే తెలుగు టీచర్. అప్పటికే బడి, ఆసుపత్రి, చిన్న బ్రిడ్జి కోసం మూడు దశాబ్దాలుగా ఎదురుచూసిన ఆ గిరిజనం అలసిపోతారు.


ఈ ఎన్నికలు, నాయకుల వల్ల ఉపయోగం లేదని అర్థం చేసుకుంటారు. పర్యవసానంగా ఓటు వేయకూడదు అని నిర్ణయించుకుంటారు. వారి నిర్ణయాన్ని మార్చి.. ఓటు విలువను తెలియచెప్పి వారందరిచేతా వంద శాతం ఓటు వేయిస్తాడు శ్రీనివాస్. ఎన్నికలయ్యాక బ్యాలెట్ బాక్సులతో వెళుతోన్న ఎన్నికల సిబ్బందిని ఆ ప్రాంత ప్రజలు కిడ్నాప్ చేస్తారు. తమ డిమాండ్లు నెరవేరిస్తేనే వీరిని వదిలిపెడతాం అంటారు.


కేవలం 250 ఓట్లు మాత్రమే ఉన్న ఆ జనం కోసం ప్రభుత్వం, అధికారులు దిగొచ్చారా.. ఆ గిరిజనుల సమస్యల కోసం ఆ తెలుగు టీచర్ చేసిన త్యాగం ఏంటీ..? చివరికి ఆ గిరిజనుల సమస్య ఎలా పరిష్కారమైందీ అనేదే ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా కథ.

విశ్లేషణ:

ఈ సినిమా హిందీలో వచ్చిన రాజ్ కుమార్ రావు నటించిన న్యూటన్ కు రీమేక్. కానీ అంతకు మించిన బలమైన కథనం కనిపిస్తుంది. ప్రాంతీయత సినిమాకు బాగా కలిసొచ్చింది. ఇలాంటి కథలు తెలుగు సినిమాకు చాలా అవసరం. ఆ అవసరాన్ని తీరుస్తుందని చెప్పలేం కానీ.. అందుకు నాందితోనే నాంది పలికిన నరేష్‌ ప్రయత్నాన్ని అభినందించాల్సిందే.



నాంది పూర్తిగా సీరియస్ టోన్ లో సాగితే.. ఇది సీరియస్ గా సాగుతూనే బోలెడంత హాస్యాన్ని పండిస్తుంది. అందుకోసం ప్రవీణ్‌, వెన్నెల కిశోర్ లను బాగా వాడుకున్నారు. సెకండ్ హాఫ్‌ లో రఘుబాబు ఎపిసోడ్ బాగా నవ్విస్తుంది. బ్యాలెట్ బాక్స్ లతో ఎలక్షన్ ఆఫీసర్ ను కిడ్నాప్ చేయడం.. ఆ ఓట్లు లేకుండానే మిగతా ప్రాంతాల ఓట్లు లెక్కించడం.. సరిగ్గా ఆ ఓట్లతోనే గెలుపు ఓటమి నిర్ణయించాల్సి రావడం అంతా సినిమాటిక్ లిబర్టీస్ లో కనిపిస్తుంది.



బట్ ఆకట్టుకుంటుంది. చివర్లో కలెక్టర్ ను కాపాడేందుకు "ప్రాణం ఎవరిదైనా ప్రాణమే" అనే మాటతో నరేష్ తో కలిసి గిరిజనులు వాగు దాటేందుకు చేసిన సాహసం.. ఉత్కంఠగా ఉంటుంది. అంతకు ముందే వచ్చే వీరభద్రుడి వీర విహారం మాస్ అన్ని వర్గాల ఆడియన్స్ తో విజిల్స్ వేయిస్తుంది.


ఆర్టిస్టుల పరంగా నరేష్ కు ఇది మరో బెస్ట్ రోల్. హీరోయిన్ పాత్రలో 7వ తరగతి పాసైన జీతం లేని గిరిజన టీచర్ గా ఆనంది ఆకట్టుకుంటుంది. వెన్నెల కిశోర్, ప్రవీణ్‌, రమణ, సంపత్ రాజ్, శ్రీ తేజ్, రఘుబాబు పాత్రల మేరకు నటించారు. ఈ అందర్లోకీ శ్రీ తేజ్ బాగా నటించాడు.


సినిమాకు వెన్నె ముక బయటికి కనిపించని కెమెరామెన్ ల కష్టం. చాలా క్లిష్టమైన అటవీ ప్రాంతాల్లో చిత్రీకరించారు. సంగీతం బావుంది. పాటలూ ఓకే. అబ్బూరి రవి మాటలు కథకు తగ్గట్టుగా డ్రామాను సహజత్వాన్ని బ్యాలన్స్ చేస్తూ సాగాయి. భాష విషయంలో ఏ యాస కనిపించకపోవడం మైనస్ అనిపిస్తుంది.



కాస్ట్యూమ్స్ పరంగా ఆ ప్రాంత ప్రజల జీవన విధానాన్ని ఇంకాస్త స్టడీ చేయాల్సి ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ బావున్నాయి. దర్శకుడుగా మోహన్ ప్రయత్నం మెచ్చదగింది. హిందీ వెర్షన్ కు భిన్నమైన నేపథ్యాన్ని ఎంచుకున్నాడు. అదే సినిమాకు పెద్ద ఎసెట్ గా నిలిచింది. అద్భుతం అనలేం కానీ.. ఖచ్చితంగా చూడదగ్గ చిత్రమే అని చెప్పొచ్చు.

Tags

Read MoreRead Less
Next Story