Karthika Deepam : సీరియల్స్ కు సినిమా లుక్.. కార్తీక దీపంకు ప్రీమియర్లు

Karthika Deepam : సీరియల్స్ కు సినిమా లుక్.. కార్తీక దీపంకు ప్రీమియర్లు

సినిమాలు, ఓటీటీలదే ఇప్పుడు హవా అంతా. టీవీలు చూసే ప్రేక్షకులు ఓటీటీ వచ్చాక తగ్గిపోయారు. ఐతే.. సీరియల్స్ ప్రాణాధారమైన ఎంటర్ టైన్ మెంట్ శాటిలైట్ ఛానళ్లు కొత్త మార్గాలు వెతుక్కుంటున్నాయి. తమ రేటింగ్ కోసం కొత్త పద్ధతులు ఫాలో అవుతున్నాయి.

సీరియల్స్ ని సినిమా ప్రమోషన్లలో వాడుకొంటున్న వైనం చూస్తూనే ఉన్నాం. సీరియల్స్ లో బాగా పేలిన క్యారెక్టర్లు సైతం వెండి తెరపై కనిపిస్తుంటాయి. అలా.. సీరియల్స్ గట్టి ప్రభావాన్నే చూపిస్తున్నాయి. 'కార్తీక దీపం' సీరియల్ తెలుగులో ఓ ట్రెండ్ సెట్టర్. ఈ సీరియల్ సాధించిన క్రేజ్ అంతా ఇంతా కాదు. వంటలక్క, డాక్టర్ బాబు పాత్రలు ప్రతీ ఇంటిలోనూ మార్మోగిపోయాయి. కార్తీక దీపం అయిపోయింది.

ఇప్పుడు పార్ట్ 2 కూడా వస్తోంది. ఈనెల 25 నుంచి 'కార్తీక దీపం 2' (Karthika Deepam 2) ప్రసారం కాబోతోంది. దీనికి సినిమా స్థాయిలో ప్రచారాన్ని కలిగిస్తోంది టీవీ యాజమాన్యం. ఏకంగా ఈ సీరియల్‌కి ప్రివ్యూలు, ప్రీమియర్లు ప్లాన్ చేస్తోంది. గురువారం 'కార్తీక దీపం 2' ప్రీమియర్ హైదరాబాద్ లో ఏర్పాటు చేశారు. ఈ సీరియల్ లోని మొదటి భాగాన్ని ముందుగానే కొంతమంది 'కార్తీక దీపం' అభిమానులకు చూపించబోతున్నారు. ఇన్నాళ్లూ సినిమాలకు ప్రీమియర్లు చూశాం. ఓ సీరియల్ కు ప్రీమియర్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. ఆ రకంగా 'కార్తీక దీపం' రికార్డు సృష్టించిందనే అనుకోవాలి. ఇక మీదట.. సీరియల్స్ కూడా ఇలా ప్రివ్యూలూ, రివ్యూలూ అంటూ చెలరేగిపోయే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story