Eluru Fire Accident : ఏలూరులో అగ్నిప్రమాదం.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య.. !

Eluru Fire Accident : ఏలూరులో అగ్నిప్రమాదం.. ఆరుకు చేరిన మృతుల సంఖ్య.. !
Eluru Fire Accident : ఏలూరు జిల్లాలో కెమికల్‌ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది..

Eluru Fire Accident : ఏలూరు జిల్లాలో కెమికల్‌ ఫ్యాక్టరీలో జరిగిన ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.. స్పాట్‌లో ఐదుగురు సజీవ దహనం అయ్యారు.. మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు.. దీంతో ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకు చేరింది.. మరో 12 మంది పరిస్థితి విషమంగా ఉంది.. క్షతగాత్రులకు విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.. క్షతగాత్రుల ఆర్తనాదాలు, బంధువుల రోదనలతో ఆస్పత్రి పరిసరాలు నిండిపోయాయి.

ముసునూరు మండలం అక్కిరెడ్డి గూడెంలోని ఫోరస్‌ కెమికల్‌ ఫ్యాక్టరీ నాలుగో యూనిట్‌లో గ్యాస్‌ లీక్‌ అవడంతో మంటలు చెలరేగాయి.. ఆ వెంటనే రియాక్టర్‌ పేలిపోయింది.. ప్రమాదం జరిగిన సమయంలో ఆ యూనిట్‌లో 18 మంది కార్మికులు విధులు నిర్వహిస్తున్నారు.. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో వారు అక్కడ్నుంచి తప్పించుకోలేకపోయారు.. మంటల్లో కాలి బూడిదైపోయారు.. ప్రమాదం జరిగిన తర్వాత అక్కడ పరిస్థితి మరింత భీతావహంగా మారింది.. ప్రమాదం విషయం తెలియగానే హుటాహుటిన ఫైర్‌ సిబ్బంది అక్కడు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.. అటు ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు కూడా సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. మంటల్లో కాలిపోయిన కార్మికుల శరీరాలు అస్థిపంజరాలుగా మారిపోయాయి. దీనిని బట్టే తెలుస్తోంది ప్రమాద తీవ్రత ఏస్థాయిలో ఉందో..

ఔషధాల్లో వాడే పొడిని ఈ కెమికల్‌ ఫ్యాక్టరీలో తయారు చేస్తున్నారు.. ప్రమాదం ఎలా జరిగిందనేదానిపై అధికారులు కారణాలను అన్వేషిస్తున్నారు.. మృతుల వివరాలు కూడా ఇంకా తెలియరాలేదు.. యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని బాధితులు చెప్తున్నారు.. ప్రమాదాలు జరగకుండా కనీస జాగ్రత్తలు కూడా తీసుకోలేదని అంటున్నారు.. చక్కెర కార్మాగారాన్ని కెమికల్‌ ఫ్యాక్టరీగా మార్చారని కార్మికులు చెప్తున్నారు.. కనీసం ప్రమాదం జరిగిన తర్వాత అంబులెన్స్‌కు కూడా ఫోన్‌ చేయలేదని బాధితులు వాపోతున్నారు.. ప్రమాదం జరిగిన సమయంలో 150 మంది వరకు ఫ్యాక్టరీలో పనిచేస్తున్నట్లు కార్మికులు చెప్తున్నారు.

అటు ఘటనా స్థలాన్ని ఏలూరు ఎస్పీ పరిశీలించారు.. ప్రస్తుతం క్షతగాత్రులను మొదట నూజివీడు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.. కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం విజయవాడ ఆస్పత్రికి తరలించారు.. అయితే, వారందరి పరిస్థితి మరింత విషమంగా ఉంది.. క్షతగాత్రుల్లో ఏడుగురు బీహార్‌కు చెందినవారు కాగా.. మిగిలిన వారు స్థానికులుగా చెప్తున్నారు.

అటు ఈ ఘటనపై ముఖ్యమంత్రి జగన్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి 25 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది ప్రభుత్వం.. తీవ్రంగా గాయపడిన వారికి ఐదు లక్షలు, గాయపడిన వారికి 2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించింది.. అటు ఘటనపై పూర్తి దర్యాప్తు చేయాలని ఎస్పీ, కలెక్టర్‌ను సీఎం ఆదేశించారు.. గాయపడిన వారికి పూర్తిస్థాయిలో వైద్య సాయం అందించాలన్నారు.

Tags

Read MoreRead Less
Next Story