హైదరాబాదులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎంపీటీసి దంపతుల దుర్మరణం

హైదరాబాదులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఎంపీటీసి దంపతుల దుర్మరణం
X

నగర శివారులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. హైదరాబాద్-విజయవాడ హైవే మీద మంగళవారం రాత్రి 10గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తానేదార్‌పల్లి ఎంపీటీసీ దొంతం కవిత, ఆమె భర్త వేణుగోపాల్ రెడ్డి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

దంపతులిద్దరూ మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో నల్గొండ నుంచి స్కార్పియో వాహనంలో హైదరాబాద్ బయలుదేరారు. జాతీయ రహదారిపై వస్తూ పెద్ద అంబర్‌పేట్ ఓఆర్ఆర్ చేరుకొని యూటర్న్ తీసుకున్నారు. అదే సమయంలో కారు ముందు వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వేశాడు. దాంతో స్కార్పియో వేగం అదుపు చేసుకోలేకపోయింది. టిప్పర్ వెనుక భాగాన్ని బలంగా గుద్దుకుంది. ఆ తాకిడికి కారులోని వారికి తీవ్రగాయాలై రక్తమోడుతుండగా అపస్మారకస్థితిలోకి వెళ్లిపోయారు.

ఈ ఘటనను కళ్లారా చూసిన స్థానికులు హుటాహుటిన అక్కడికి చేరుకుని సహాయక చర్యలు అందించారు. తీవ్రంగా గాయపడిన దంపతులను ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నిస్తుండగా అక్కడే ప్రాణాలు విడిచారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

గతవారమే కూతురు వివాహాన్ని నల్గొండలో ఘనంగా జరిపించారు ఎంపీటీసీ దంపతులు. వారం తిరక్కుండానే ఆ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఎంపీటీసీ కవిత దంపతుల దుర్మరణం పట్ల స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Next Story

RELATED STORIES