ఏ వారానికి ఏ గ్రహం.. ఎవరు అధిపతి..

ఏ వారానికి  ఏ గ్రహం.. ఎవరు అధిపతి..
ఓ మంచి పని తలపెట్టాలంటే మంచి రోజు కోసం చూడ్డం ఆనవాయితీ. కానీ అన్ని రోజులు మంచివే..

ఓ మంచి పని తలపెట్టాలంటే మంచి రోజు కోసం చూడ్డం ఆనవాయితీ. కానీ అన్ని రోజులు మంచివే.. అయినా ఆ వారానికి అధి దేవుడి అనుగ్రహం ఉంటే తలపెట్టిన కార్యం తప్పక నెరవేరుతుందనే ఓ ప్రగాఢ విశ్వాసం. ఆ నమ్మకమే మనిషిని ముందుకు నడిపిస్తుంది.

రోజులను లెక్కించే సమయంలో మొదటి స్థానంలో ఉండే ఆదివారానికి అధిపతి సూర్యుడు. ఆది అంటే మొదటి అని అర్థం. వేకువ జామున వెలుగులు పంచుతూ లోకాన్ని అంధకారం నుంచి బయటకు తీసుకు వచ్చే ఆది దేవుడు సుర్యుడు. ఆయన ఒక్కరోజు అలిగి మబ్బుల చాటుకు వెళ్లినా లోకం అంధకార బంధురం. ఆదిత్య హృదయ స్తోత్రంలో సూర్యుడు ఆరోగ్య ప్రదాతగా, విజయ ప్రదాతగా దర్శనమిస్తాడు.

సోమవారానికి అధిపతి చంద్రుడు.. చంద్రుని చల్లని వెన్నెల ఎన్నో ప్రాణులను బ్రతికిస్తోంది. నవగ్రహాల్లో చంద్రుడికి స్థానం కల్పించింది జ్యోతిశ్శాస్త్రం. భూలోకానికి సూర్యుని తరువాత చంద్రుడే ప్రాణదాత.

మంగళవారానికి అధిపతి కుజుడు. ఇతడిని అంగారకుడు అని కూడా పిలుస్తారు. మంగళం అంటే శుభం అని అర్థం. ఈ గ్రహాన్ని ఆరాధిస్తే శుభం కలుగుతుందని శాస్త్రం చెబుతుంది. అంగారకుడు భూమి పుత్రుడు అనే విశ్వాసం అనాది నుంచి ఉంది.

బుధవారానికి అధిపతి బుధుడు. చంద్రుడి పుత్రుడిగా పురాణాలు అభివర్ణిస్తాయి. బుధుడు ఏ గ్రహంతో సన్నిహితంగా ఉంటాడో, ఆ గ్రహానికి సంబంధించిన గుణాలే బుధుణ్ని అంటుకుని ఉంటాయని జ్యోతీష్యం చెబుతుంది.

గురువారానికి అధిపతి బృహస్పతి. దేవతలకు గురువుగా బృహస్పతి ప్రసిద్ధి. ఈ గ్రహ అనుగ్రహం ఉంటే సకల విద్యలూ సంప్రాప్తిస్తాయని విశ్వసిస్తారు. సౌరమండలంలో అతి పెద్ద గ్రహం కూడా గురువు

శుక్రవారానికి అధిపతి శుక్రాచార్యుడు. ఇతడు రాక్షసగురువు. మరణించిన వారిని బతికించే విద్య తెలిసిన వాడు. ఆకాశంలో అత్యంత ప్రకాశవంతంగా వెలిగే ఇతడిని వేగుచుక్కగా కొలుస్తారు.

శనివారానికి అధిపతి శనీశ్వరుడు. ఇతడి గమనం మెల్లగా ఉంటుంది. ప్రాణుల పాప పుణ్యాలకు వెంటనే అనుగ్రహం చూపించేవాడిగా శనీశ్వరుడికి పేరుంది. ఇతడిని భక్తితో ఆరాధిస్తే చెడు తొలగిపోతుందని, మంచి జరుగుతుందని నమ్ముతారు జనం.

Tags

Read MoreRead Less
Next Story