ఓ వైపు కరోనా.. మరోవైపు వైరస్‌ న్యూ వేరియంట్‌‌కి తోడు బర్డ్‌ ఫ్లూ టెన్షన్‌

ఓ వైపు కరోనా.. మరోవైపు వైరస్‌ న్యూ వేరియంట్‌‌కి తోడు బర్డ్‌ ఫ్లూ టెన్షన్‌
తెలుగు రాష్ట్రాల్లో కొన్ని చోట్ల కోళ్లు మృతి చెందడం కలకలం రేపుతోంది.

ఓ వైపు కరోనా కాటు.. మరోవైపు వైరస్‌ న్యూ వేరియంట్‌ భయాలకు తోడు ఇప్పుడు బర్డ్‌ ఫ్లూ వ్యాప్తి టెన్షన్‌ పెంచుతోంది. బర్డ్‌ ఫ్లూ జాబితాలో చేరిన రాష్ట్రాల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. తాజాగా 10 రాష్ట్రాల్లో ఈ వ్యాధి వ్యాప్తి చెందినట్టు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఇప్పటికే కేరళ, రాజస్తాన్, మధ్యప్రదేశ్, హిమాచల్‌ ప్రదేశ్, హరియాణా, గుజరాత్, ఉత్తరప్రదేశ్‌లో బర్డ్‌ఫ్లూ నిర్ధారణ కాగా, తాజాగా ఢిల్లీ, ఉత్తరాఖండ్, మహారాష్ట్రలోనూ ఈ వ్యాధిని గుర్తించారు. రాజస్తాన్‌లోని టోంక్, కరౌలి, భిల్వారా, గుజరాత్‌లోని వల్సాద్, వడోదర, సూరత్‌ జిల్లాల్లో కాకులు, వలస పక్షలు, అడవి పక్షులు బర్డ్‌ ఫ్లూతో మరణించినట్లు కేంద్రం నిర్ధారించింది. ఉత్తరాఖండ్‌లోని కోట్‌ద్వార్, డెహ్రాడూన్‌ జిల్లాల్లో కూడా కాకులు మరణించినట్లు తెలిపింది. తూర్పు ఢిల్లీలోని సంజయ్‌ లేక్‌ ప్రాంతంలో కాకులు, బాతుల మరణానికి బర్డ్‌ఫ్లూ కారణమని తేల్చింది.

మహారాష్ట్రలోని పర్భనీ జిల్లాలో కోళ్లకు బర్డ్‌ ఫ్లూ సోకినట్లు నిర్ధారించారు. అలాగే ముంబై, థానే, దపోలి, బీడ్‌ ప్రాంతాల్లోనూ బర్డ్‌ ఫ్లూ కేసులు వెలుగు చూసినట్లు కేంద్రం వెల్లడించింది. బర్డ్‌ ఫ్లూపై తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడాన్ని నిరోధించాలని అన్ని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. నీటి వనరులు, పక్షుల మార్కెట్లు, జంతు ప్రదర్శనశాలలు, పౌల్ట్రీ ఫామ్‌ల చుట్టూ నిఘా పెంచాలని, మరణించిన పక్షులను పారవేయడంలో సరైన జాగ్రత్తలు పాటించాలని పేర్కొంది. దేశంలో బర్డ్‌ఫ్లూ కేసులు ఉన్నప్పటికీ పౌల్ట్రీ ఉత్పత్తుల విక్రయంపై నిషేధం విధించాల్సిన అవసరం లేదని, మార్కెట్లను మూసివేయొద్దని కేంద్ర పశు సంవర్థక శాఖ మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ అన్ని రాష్ట్రాలకు సూచించారు. బర్డ్‌ఫ్లూ వ్యాధి పక్షులు, పశువుల నుంచి మనుషులకు సోకుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని గుర్తుచేశారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ కొన్ని చోట్ల కోళ్లు మృతి చెందడం కలకలం రేపుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ కోళ్లు మృతిచెందడంతో భయాందోళనలు నెలకొన్నాయి. ఒకవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో బర్డ్‌ఫ్లూ వైరస్ విజృంభిస్తున్న తరుణంలో.. కోళ్లు చనిపోవడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. చనిపోయిన కోళ్ల శాంపిల్స్‌ను సేకరించి పరీక్షల కోసం ల్యాబ్‌కు పంపించారు. మరణించిన కోళ్లలో కొక్కర వ్యాధి లక్షణాలు కనిపిస్తున్నాయన్నారు. అయితే మన రాష్ట్రానికి బర్డ్ ఫ్లూ వచ్చే అవకాశం లేదని భరోసా ఇస్తున్నారు.

మరోవైపు చికెన్ అమ్మకాలు భారీగా పడిపోతున్నాయి. ధరలు 50 శాతం క్షీణించాయి. కోడి గుడ్డ ధర కూడా 15-20 శాతం పడిపోయింది. ఆరు నెలల కిందట వరకు తమ వ్యాపారాన్ని కరోనా దెబ్బతీస్తే, ఇప్పుడు బర్డ్‌ ఫ్లూతో మళ్లీ కష్టాలు వచ్చాయని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

బర్డ్ ఫ్లూపై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందించింది. కోడి, బాతు మాంసం, గుడ్లు నిర్భయంగా తినొచ్చని డబ్ల్యూహెచ్ఓ వెల్లడించింది. సగం ఉడికినవి తినొద్దని.. బాగా ఉడకబెట్టిన తర్వాతే తినాలని సూచించింది.

Tags

Read MoreRead Less
Next Story