Omicron variant : భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభణ.. ఒక్కరోజే 17 కేసులు..!

Omicron variant : భారత్‌లో ఒమిక్రాన్‌ వేరియంట్‌ విజృంభణ.. ఒక్కరోజే 17 కేసులు..!
Omicron variant : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో విజృంభిస్తుంది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఒకే కుటుంబంలో 9 కేసులు వెలుగుచూశాయి.

Omicron variant : ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ భారత్‌లో విజృంభిస్తుంది. రాజస్థాన్‌ రాజధాని జైపూర్‌లో ఒకే కుటుంబంలో 9 కేసులు వెలుగుచూశాయి. ఇటీవల దక్షిణాఫ్రికా నుంచి జైపూర్‌కు వచ్చిన నలుగురిలో శాంపిల్స్ సేకరించి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించగా ఒమిక్రాన్ బయటపడింది. వారితో ఉన్న మరో ఐదుగురిని పరీక్షించగా వారికీ పాజిటివ్‌గా తేలింది. వీరిలో ముగ్గురు చిన్న పిల్లలు కూడా ఉన్నారు. ఒమిక్రాన్ పాజిటివ్‌ తేలిన వారిని ఆర్​యూ హెచ్​ఎస్​ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం రోగుల పరిస్థితి బాగానే ఉందని.. లక్షణాలేవీ లేవని వైద్యులు తెలిపారు.

మహారాష్ట్రలో మరో 7 ఒమిక్రాన్​ కేసులు నమోదయ్యాయి. విదేశాలకు వెళ్లి వచ్చిన నలుగురు, వారిని కలిసిన ముగ్గురికి ఒమిక్రాన్​ వేరియంట్​నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. బాధితుల్లో నైజీరియా నుంచి వచ్చిన మహిళ, ఆమె ఇద్దరు కూతుళ్లు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పుణె జిల్లా పింప్రి చించ్వాడా ప్రాంతంలోని తన సోదరుడిని కలిసేందుకు వచ్చినట్లు చెప్పారు. దీంతో ఆమె సోదరుడు, ఆయన ఇద్దరు కుమార్తెలకు సైతం ఒమిక్రాన్​ వేరియంట్​ సోకిందని వెల్లడించారు. మరోవైపు.. ఫిన్​లాండ్​ నుంచి పుణెకు గత నెల చివర్లో వచ్చిన వ్యక్తికి ఒమిక్రాన్​నిర్ధారణ అయిందని వెల్లడించారు. తాజాగా వెలుగు చూసిన కేసులతో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8 కేసులు నమోదయ్యాయి.

దేశ రాజధాని ఢిల్లీలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ తొలి కేసు వెలుగుచూసింది. టాంజానియా నుంచి ఢిల్లీకి వచ్చిన యువకుడిలో ఈ వైరస్ కనుగొన్నారు. వెంటనే అతనిని లోక్ నాయక్ ఆసుపత్రికి తరలించారు. ఇంత వరకూ కరోనా పాజిటివ్‌గా నిర్దారణ అయిన 17 మంది ఎల్ఎన్‌జేపీ ఆసుపత్రిలో అడ్మిట్ అయినట్టు చెప్పారు. 12 శాంపిళ్లను నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు పంపామని, ఒకరిలో ఒమైక్రాన్ వేరియంట్ కనిపించిందని, అతను కొద్దిరోజుల క్రితమే టాంజానియా నుంచి తిరిగి వచ్చినట్టు తెలిపారు.

కర్ణాటక ప్రభుత్వం విద్యార్థులకు ర్యాండమ్‌గా నిర్వహిస్తున్న కరోనా పరీక్షల్లో పెద్దఎత్తున కేసులు బయటపడుతున్నాయి. చిక్‌మగళూరు జిల్లాలోని జవహర్‌ నవోదయ విద్యాలయంలో 63 మంది విద్యార్థులకు మహమ్మారి సోకినట్లు తేలింది. టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్‌తో సహా మొత్తం 418 శాంపిల్స్‌ను పరీక్షించగా.. ఈ కేసులు బయటపడినట్లు అధికారులు వెల్లడించారు. శివమొగ్గలోని ఓ ప్రైవేటు నర్సింగ్‌ కళాశాలలో 29 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్‌గా వెల్లడైంది. వారిలో చాలా మందికి లక్షణాలు లేవని వెల్లడించారు. దీంతో ఈ ప్రాంతాలను క్లస్టర్‌లుగా ప్రకటించి, హాస్టళ్లను మూసివేసినట్లు అధికారులు చెప్పారు.

మహారాష్ట్ర, రాజస్థాన్‌, కర్ణాటకలో, గుజరాత్‌, ఢిల్లీలో ఒమిక్రాన్‌ కేసులు నమోదవడంతో ఇతర రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.

Tags

Read MoreRead Less
Next Story