Indo China Clash: పేర్లు మార్చితే... చరిత్ర మారిపోదు

Indo China Clash: పేర్లు మార్చితే... చరిత్ర మారిపోదు
మరోసారి తెగించిన చైనా; అరుణాచల్ ప్రదేశ్ లో కొన్ని ప్రాంతాలకు కొత్త పేర్లు

అరుణాచల్ ప్రదేశ్ అంశంలో చైనా మరోసారి బరితెగింపు చర్యలకు పాల్పడింది. అరుణాచల్ ప్రదేశ్ లో సుమారు 15 ప్రాంతాలకు పునర్ నామకరణం చేసింది. ఈ మేరకు రెండు మైదాన ప్రాంతాలు, రెండు జనావాస ప్రాంతాలు, ఐదు శిఖరాలతో పాటూ మరో రెండు చెరువులతో కూడిన జాబితాను చైనా పౌర వ్యవహారాల మంత్రిత్వశాఖ విడుదల చేసింది. తద్వారా ఈ ప్రాంతాలపై తమ హక్కులను ప్రకటించుకుంది. ఆ శాఖ ఈ విధంగా భారతీయ ప్రాంతాలకు కొత్త పేర్లు పెడుతూ జాబితా విడుదల చేయడం ఇది మూడో సారి కావడం విశేషం. 2017లో బౌద్ధ ఆధ్యాత్మిక గురువు దలైలామా అరుణాచల్ ప్రదేశ్ ను సందర్శించిన అనంతరం కొన్ని ప్రాంతాల పేర్లు మార్చుతూ తొలి జాబితాను విడుదల చేసింది.

అయితే చైనా తాజా చర్యపై భారత్ హుందాగా స్పందించింది. చైనా ఎన్ని విధాలుగా ప్రయత్నించినప్పటికీ చరిత్రను, వాస్తవాన్ని మార్చలేదని స్పష్టం చేసింది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఈ మేరకు ఓ ప్రకటనను విడుదల చేసింది. అరుణాచల్ ప్రదేశ్ భారత్ లో అంతర్భాగమని, దాన్ని ఎవరు వేరు చేయలేరని స్పష్టం చేసింది. ఎన్ని కుటిల ప్రయోగాలు చేసినా వాస్తవాన్ని వక్రీకరిచలేరని వెల్లడించింది.


Tags

Read MoreRead Less
Next Story