Asia Cup, IND vs PAK: రివేంజ్ తీరుతుందా..

Asia Cup, IND vs PAK: రివేంజ్ తీరుతుందా..
దాయాదుల మలి పోరులో వరుణుడే కీలకం

ఆసియాకప్‌లో హైటెన్షన్‌ సమరానికి.. సర్వం సిద్ధమైంది. సూపర్‌ ఫోర్‌లో ఇప్పటికే ఒక మ్యాచ్‌ గెలిచి ఊపు మీదున్న పాకిస్థాన్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ఫైనల్‌ వైపు బలంగా అడుగేయాలని రోహిత్‌ సేన పట్టుదలగా ఉంది. కానీ బలమైన పాక్ బౌలింగ్‌ను ఎదుర్కోవడం భారత బ్యాటింగ్‌కు సవాల్‌గా మారనుంది. పేపర్‌పై భారత్‌ కంటే పాకిస్థాన్‌ బలంగా ఉందని మాజీలు అంచనా వేస్తున్న వేళ కీలకమైన ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి తీరాలని భారత జట్టు ప్రణాళిక రచిస్తోంది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్‌కు రిజర్వ్‌ డే కూడా ఉండడంతో ఫలితం తప్పకుండా వస్తుందన్న ఆశతో ఉన్నారు క్రికెట్ ప్రేమికులు.

ఆసియాకప్‌లో అసలు సిసలు సమరానికి సర్వం సిద్ధమైంది. సూపర్‌ 4లో భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు ఆదివారం జరగనుంది. దాయాదుల పోరు కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. పదునైన పాక్ బౌలింగ్‌ దాడిని భారత బ్యాటర్లు ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. పిచ్‌ స్వభావంతో సంబంధం లేకుండా షహీన్‌ షా ఆఫ్రీది, హారిస్ రౌఫ్, నసీమ్‌ షా రాణిస్తున్నారు. ఆసియా కప్‌లో హారిస్ రౌఫ్ మూడు మ్యాచ్‌ల్లో 9 వికెట్లు పడగొట్టి అగ్రస్థానంలో ఉండగా.. షహీన్‌ షా అఫ్రీది, నసీమ్‌ షా చెరో ఏడు వికెట్లు పడగొట్టారు. ఈ బౌలింగ్‌ త్రయాన్ని రోహిత్‌ సేన ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. పాకిస్థాన్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత టాపార్డర్‌ విఫలమవ్వడం ఆందోళన.... కలిగిస్తోంది. కానీ నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌, గిల్‌ సాధికారికంగా బ్యాటింగ్‌ చేశారు. అయితే నేపాల్‌ బౌలింగ్‌తో పోలిస్తే చాలా పటిష్టంగా ఉండే పాక్‌ బౌలింగ్‌ను ఎదుర్కోవడం భారత్‌కు సవాల్‌గా మారనుంది.


పాక్‌ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోగలమని భారత్‌ భావిస్తోంది. నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్లు రోహిత్‌ శర్మ, శుభ్‌మన్‌ గిల్‌ రాణించడం టీమిండియాకు ఊరట కలిగించింది. కె.ఎల్‌. రాహుల్‌ జట్టులో చేరడం భారత్‌కు కలిసిరానుంది. అయితే ఫామ్‌లో ఉన్న ఇషాన్‌ కిషన్‌ను కాదని రాహుల్‌కు తుది జట్టులోకి తీసుకునే అవకాశాలు లేవని మాజీలు అంచనా వేస్తున్నారు. నెట్స్‌లో రాహుల్‌ తీవ్రంగా శ్రమిస్తుండడంతో ఇద్దరికి తుది జట్టులో స్థానం దక్కవచ్చనే ఊహాగానాలు ఉన్నాయి. నేపాల్‌తో జరిగిన లీగ్ మ్యాచ్‌కు దూరంగా ఉన్న జస్ప్రీత్ బుమ్రా తిరిగి రావడం భారత బౌలింగ్‌ బలాన్ని పెంచింది. బుమ్రా జట్టులోకి రావాలంటే షమి, సిరాజ్‌, శార్దూల్‌లో ఒకరు బయటకు వెళ్లాలి. బుమ్రా గైర్హాజరీలో ఆడిన షమిపైనే వేటు పడనుందని తెలుస్తోంది.మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌, కుల్‌దీప్‌ యాదవ్‌లతో కూడిన టీమిండియా బౌలింగ్‌ పర్వాలేదనిపించేలా ఉంది.

కొలంబోలో జరిగే ఈ మ్యాచ్‌కు కూడా వర్షంతో ముప్పు ఉందని తేలడంతో అభిమానులు డీలా పడుతున్నారు. అయితే ఈ హైవోల్టేజి మ్యాచ్‌ను ఎలాగైనా నిర్వహించాలనే ఆసక్తితో ఉన్న ఆసియా క్రికెట్‌ మండలి రిజర్వ్‌ డేను ప్రకటించింది

Tags

Read MoreRead Less
Next Story