National News : ఖర్గే, జైరాం రమేశ్‌కు లీగల్ నోటీసులు పంపిన నితిన్‌ గడ్కరీ

National News : ఖర్గే, జైరాం రమేశ్‌కు లీగల్ నోటీసులు పంపిన  నితిన్‌ గడ్కరీ

కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Kharge), జనరల్‌ సెక్రటరీ జైరాం రమేశ్‌లకు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ లీగల్ నోటీసులు పంపారు. తాను మాట్లాడిన మాటలను వక్రీకరించి, సామాజిక మాధ్యమాల్లో పెట్టిన పోస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి లీగల్ నోటీసులు పంపారు. 3 రోజుల్లో కాంగ్రెస్‌ రాతపూర్వక క్షమాపణలు చెప్పాలని ఆ లేఖలో పేర్కొన్నారు గడ్కరీ. అలాగే నోటీసు అందించిన 24 గంటల్లో ఆ పోస్టును తొలగించాలని డిమాండ్ చేశారు. బీజేపీలో సైద్ధాంతిక చీలికను సృష్టించేందుకు, సభ్యులను రెచ్చగొట్టే దురుద్దేశపూర్వక చర్యే ఇది’ అని తన నోటీసులో గడ్కరీ విమర్శించారు.

‘గ్రామస్థులు, పేదలు, రైతులు, కూలీలు సంతోషంగా లేరు. గ్రామాల్లో మంచి రోడ్లు లేవు. తాగునీరు, మంచి ఆసుపత్రులు, పాఠశాలలు అందుబాటులో లేవు’ అంటూ గడ్కరీ మాట్లాడినట్టుగా ఉన్న వీడియోను కాంగ్రెస్ సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ప్రధాని మోదీ నాయకత్వంలో రానున్న సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ సిద్ధమవుతున్న తరుణంలో కాంగ్రెస్ చర్యలు సంచలనం కలిగించేలా, తన ప్రతిష్టను దిగజార్చేలా ఉన్నాయని గడ్కరీ నోటీసుల్లో పేర్కొన్నారు.

ఈ ప్రభుత్వ హయాంలో తీసుకుంటున్న చర్యల గురించి తాను చేసిన ప్రసంగాన్ని వక్రీకరించి ఈ పోస్టు పెట్టిందంటూ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఆ సందర్భం ఉద్దేశాన్ని బయటపెట్టకుండా, అర్థం మారేలా ఆ క్లిప్పింగ్‌లో మార్పులు చేశారు. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకు, నన్ను కించపరిచేందుకు కాంగ్రెస్ నేతలు చేసిన ప్రయత్నమిది అని గడ్కరీ విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story