Phone Tapping Case : ఈ నెల12 వరకు రాధాకిషన్ రావు రిమాండ్ పొడిగింపు

Phone Tapping Case : ఈ నెల12 వరకు రాధాకిషన్ రావు రిమాండ్ పొడిగింపు

ఫోన్ ట్యాపింగ్ కేసులో టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్రావు రిమాండ్ ను కోర్టు పొడిగించింది. వారం రోజుల కస్టడీ ఇవాల్టితో ముగిసింది. దీంతో పోలీసులు ఆయన్ను నాంపల్లి కోర్టులో హాజరుపరిచారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈనెల 12 వరకు రిమాండ్ ను పొడిగిస్తున్నట్లు పేర్కొంది. అంతకుముందు జైల్ లో లైబ్రరీకి వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వడం లేదని రాధాకిషన్ రావు కోర్టు దృష్టికి తీసు కెళ్లారు.

జైలు సూపరింటెండెంట్ ను సైతం కలవనీయడం లేదని కంప్లెంట్ ఇచ్చారు. దీనిపై పోలీసులను కోర్టు ప్రశ్నించింది. లైబ్రరీలోకి అనుమతించడంతో పాటు సూపరింటెండెంట్ ను కలిసేలా అవకాశం కల్పిస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. అనంతరం రాధాకిషన్ రావును చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోవైపు కస్టడీలో ఉన్న ఆయన నుంచి పోలీసులు కీలక విషయాలు రాబట్టారు. రాధాకిషన్ రావు వాంగ్మూలం ఆధారంగా మరికొందరికి నోటీసులు ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

మరోవైపు ఈ కేసుపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేసు విచారణ కోసం స్పెషల్ పీపీను ప్రభుత్వం నియమించనుంది. పోలీసులు నెల రోజులుగా ఫోన్ టాపింగ్ కేసు విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో నలుగురు అధికారులను అరెస్టు చేశారు. మాజీ డీసీపీ రాధా కిషన్ రావు, మాజీ అడిషనల్ ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న, మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావులు అరెస్టు అయిన విషయం తెలిసిందే. హై ప్రొఫైల్‌ కేసు కావడంతో ప్రత్యేక పీపీని నియమించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story