Tamilnadu : ఆందోళనకరంగా పులుల మ‌ర‌ణాలు

Tamilnadu : ఆందోళనకరంగా పులుల మ‌ర‌ణాలు
నెలరోజుల్లో తొమ్మిది పెద్ద పులులు ,ఐదు చిన్న పులి పిల్లల అనుమానాస్పద మృతి

గత కొంత కాలంగా పెద్దపులులకు రక్షణ లేకుండా పోతోంది. దట్టమైన అడవుల్లో సైతం అవి వేటగాళ్లు, ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నాయి. తమిళనాడులో అయితే ఈ మరణాల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది. ఎందుకంటే కేవలం నెలరోజుల్లోనే తొమ్మిది పెద్ద పులులు ,ఐదు చిన్న పులి పిల్లలు అనుమానాస్పదంగా మృతి చెందాయి. ప్రస్తుతం ఈ అంశం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. వీటి మరణానికి సంబంధించిన అసలు కారణాలు స్పష్టంగా తెలియడం లేదు.తమిళనాడులోని ఊటీకి 13 కిలోమీటర్ల దూరంలోని చిన్న కూనూర్ గ్రామ సమీపంలోని సెగూర్ రేంజ్ అటవీప్రాంతంలో రెండు పులి పిల్లలు చనిపోయి కనిపించాయి.

నీలగిరి అడవులు పులులకు ప్రసిద్ధి. అయితే కనుచూపు మేరలో పెద్దపులి కనిపించక పోవడంతో పులి పిల్లలు ఆకలితో చనిపోయి ఉంటాయని ఐక్య పరిరక్షణ ఉద్యమ రాష్ట్ర కన్వీనర్ విజయ్ అనుమానం వ్యక్తం చేశారు. అయితే వీటి మరణానికి వేట లేదా విషం కూడా కావచ్చి అని ఆందోళన వ్యక్తం చేశారు. చనిపోయిన పులిపిల్లకు పోస్టు మార్టం చేయించిన పోలీసులు అనంతరం వాటిని దహనం చేశారు. ఇలా వరుసగా పులుల చనిపోవడంతో ఆందోళన చెందుతున్న అధికారులు వీటి మరణాలపై విచారణ చేపట్టేందుకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేస్తున్నారు.

మరోవైపు తన ఆవును చంపాయన్న పగతో పెద్దపులలకు ఓ వ్యక్తి విషం పెట్టి చంపిన విషయం కూడా తాజాగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. మరణించిన తన ఆవు కళేబరానికి విషం రాసి అతను ఆ పులులను చంపాడు. ఈ ఘటనలో రెండు చిన్న పులులు మరణించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు అతడిని అరెస్ట్ కూడా చేశారు. ప్రపంచంలో ఉన్న మొత్తం పెద్దపులుల్లో నాలుగింట మూడొంతులకుపైగా మనదేశంలోనే ఉన్నాయి. కొన్నేళ్లుగా వీటిసంఖ్య పెరుగుతోంది. అదే సమయంలో వేటగాళ్ల బారిన పడి అవి చనిపోవడం.. తాజాగా తమిళనాడులో వరుస ఇలాంటి ఘటనలు జరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇక 2022లో దేశంలో ఏకంగా 117 పెద్దపులులు మరణించాయి. అంటే ప్రతినెలా వివిధ కారణాలతో దాదాపు 10 పులులు చనిపోయాయి. అసలకే ప్రపంచ వ్యాప్తంగా పులుల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో ఇలా వరుస మరణాలు సంభవించడం ఆందోళన కలిగిస్తుంది. ఇప్పటి కన్నా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోకపోతే ఈ సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశాలు ఉన్నాయి.

Tags

Read MoreRead Less
Next Story