ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల విజయం.. వెంటిలేటర్ పై ఉన్న మహిళకు డెలివరీ

ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ల విజయం.. వెంటిలేటర్ పై ఉన్న మహిళకు డెలివరీ
39 వారాల నిండు గర్భిణీ రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. ప్రస్తుతం తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

39 వారాల నిండు గర్భిణీ రోడ్డు ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. వైద్యులు ఆమెకు శస్త్ర చికిత్స చేసి బిడ్డను బయటకు తీశారు. ప్రస్తుతం తల్లీ బిడ్డా ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.

39 వారాల గర్భవతిగా ఉన్న నందిని తివారీ మెడికల్ చెకప్ కోసం వెళుతుండగా ఈ-రిక్షా నుండి పడిపోయింది. తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారక స్థితిలో ఉన్న తివారీని అక్టోబర్ 17న ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లో చేర్చారు. వెంటనే CT స్కాన్ చేసిన వైద్యులు మెదడు ఎడమ వైపున రక్తం గడ్డకట్టడాన్ని గమనించారు. మహిళను ఇంట్యూబేషన్ చేసి వెంటిలేటర్ సపోర్టుపై ఉంచారు.

ఎయిమ్స్ ట్రామా సెంటర్‌లో ఆరోగ్యకరమైన మగబిడ్డకు నందిని జన్మనిచ్చింది. వైద్యుల సమన్వయంతో మహిళ, శిశువు ఇద్దరూ ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం ఆమెకు వెంటిలేటర్ సపోర్ట్ తీసివేశారు, త్వరలో డిశ్చార్జ్ చేస్తారని కుటుంబసభ్యులు భావిస్తున్నారు.

న్యూరోసర్జరీ విభాగానికి చెందిన ప్రొఫెసర్ దీపక్ గుప్తా మాట్లాడుతూ, అక్టోబర్ 18న రోగికి ప్రసవం జరిగింది. ఎలక్టివ్ సిజేరియన్ ద్వారా ఆమె ఆరోగ్యవంతమైన బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసూతి మరియు గైనకాలజీ బృందం ఈ శస్త్రచికిత్సను నిర్వహించింది. శిశువును వెంటనే నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (NICU)కి పిల్లల బృందం పరిశీలన కోసం తరలించారు.

"రోగి ఆరు రోజుల పాటు వెంటిలేటర్ సపోర్ట్‌పైనే ఉంది. ఆమె ఇంకా అధిక నాసల్ కాన్యులాపై ఐసియులో ఉంది. వారం తర్వాత ఆమెను డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంది," ఆమె పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నట్లు డాక్టర్ గుప్తా తెలిపారు.

తల్లి నుండి సేకరించిన ఎక్స్‌ప్రెస్డ్ రొమ్ము పాలు ప్రతి మూడు గంటలకు ఒకసారి బిడ్డకు అందిస్తున్నారు. రోగి తలకు గాయం కావడం వలన మూర్ఛలు, పోస్ట్ ట్రామాటిక్ మతిమరుపు, చిరాకు వచ్చే ప్రమాదం ఉందని, ఆమె సాధారణ స్థితికి రావడానికి కొన్ని వారాలు పట్టవచ్చని డాక్టర్ గుప్తా చెప్పారు.

"డాక్టర్లకు ధన్యవాదాలు.. నా భార్య, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉన్నారు. అక్టోబర్ 21న నేను నా భార్యకు మా బిడ్డ ముఖాన్ని చూపించాను, కానీ ఆమె ప్రస్తుతం బాబుని గుర్తించే పరిస్థితిలో లేదు. మా మొదటి బిడ్డ కోసం మేము ఎన్నో కలలు కన్నాము. కానీ దురదృష్టవశాత్తు ప్రమాదం చోటు చేసుకుంది. అయినా దేవుడి లాంటి వైద్యులు ఆమెకు చికిత్స అందించి బిడ్డను కాపాడారు. నా భార్య కూడా త్వరలో తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుందని ఆశిస్తున్నాను అని నందిని భర్త దీపక్ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story