Eluru: ఏలూరు ప్రజలను భయపెడుతున్న రోడ్లు

Eluru: ఏలూరు ప్రజలను భయపెడుతున్న రోడ్లు
రాకపోకలకు నరకయాతన పడుతున్న వైనం; రోడ్లపై నిలబడి ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరించిన మహిళలు

ఏలూరు ప్రజల్ని రోడ్లు భయపెడుతున్నాయి. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు.. అసలే అధ్వానంగా ఉన్న రహదారులను వర్షాలు బాగా దెబ్బతీశాయి. దీంతో ఎక్కడ జారి పడతామోనని జనం ఆందోళన చెందుతున్నా రు. పాలకులు పట్టించుకోకపోవడంతో రాకపోకలకు జనం అవస్థలు పడుతున్నారు. నిత్యం తిరగాల్సిన వారైతే నరకయాతన పడుతున్నారు. రోడ్లు మట్టితో నిండిపోయి వాహనాల రాకపోకలకు వీలు లేకుండా మారిపోయా యి. ఇప్పటికైనా రోడ్లు బాగుచేసి ప్రయాణాలు సాఫీగా సాగేలా చూడండి మహాప్రభతో అని వేడుకుంటున్నారు.

ఏలూరులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన 19వ డివిజన్‌ మహిళలు వినూత్న నిరసన చేపట్టారు. అధ్వానంగా మారిన రోడ్లపై నిలబడి ప్రభుత్వానికి చేతులెత్తి నమస్కరిస్తూ పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. 15 ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన కాలనీకి ఇప్పటికీ రోడ్డు నిర్మాణం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది యమలోకపు దారి అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఏలూరు-కైకలూరు ప్రధాన రహదారిలో భారీ గుంతలు ఏర్పడ్డాయి. వర్షపు నీరు చేరడంతో రోడ్లు కాలవలను తలపిస్తున్నాయి. దీంతో ఆ గుంతల్లో చేపలను పడుతూ ప్రజలు అధికారుల తీరును ఎండగట్టారు. ఏడాది గడిచినా గుంతల రోడ్డుకు కనీసం మరమ్మత్తు కూడా చేపట్టడం లేదని మండిపడ్డారు. ఎమ్మెల్యే చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి చర్యలు చేపట్టాలని లేకపోతే నిరాహార దీక్ష చేస్తామని ప్రజలు హెచ్చరించారు.

Tags

Read MoreRead Less
Next Story