CENTRE CABINET: కృష్ణా జలాల పంపిణీలో కీలక ముందడుగు

CENTRE CABINET: కృష్ణా జలాల పంపిణీలో కీలక ముందడుగు
కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం... తెలంగాణలో పసుపు బోర్డు, గిరిజన వర్సిటీ

శాసనసభ ఎన్నికల ముంగిట తెలుగురాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వాటాల నిర్ణయంపై కీలక ముందడుగు పడింది. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నీటి కేటాయింపులను తిరిగి పరిశీలించి మళ్లీ కొత్తగా కేటాయింపులకు వీలు కల్పించేలా బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌కు అధికారాలు కట్టబెడుతూ కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కృష్ణా నదీజలాల వివాద పరిష్కార ట్రైబ్యునల్‌ నూతన విధివిధానాల ఖరారుకు కేంద్రమంత్రి వర్గం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ఈ ట్రైబ్యునల్‌ రెండు రాష్ట్రాల మధ్య ప్రాజెక్టుల వారీగా నీటిని పంపిణీ చేస్తుందని కేంద్రం ప్రకటించింది. కృష్ణా వివాదాల పరిష్కార ట్రైబ్యునల్‌-2 ద్వారా కృష్ణా ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య నీటి పంపిణీకి నూతన విధివిధానాల ఖరారుకు కేంద్రమంత్రి మంత్రివర్గం పచ్చజెండా ఊపింది. ఇందుకు అనుగుణంగా తెలుగురాష్ట్రాల్లో ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరుగుతాయని కేంద్రమంత్రి అనురాగ్‌ఠాకూర్‌ తెలిపారు.


జగన్‌ ప్రభుత్వం అసమర్థతతో దశాబ్దాల తరబడి ఆంధ్రప్రదేశ్‌కు ఉన్న నీటి హక్కులను మళ్లీ నిరూపించుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. బచావత్‌ ట్రైబ్యునల్‌ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 TMCల నీటిలో పునర్‌ వ్యవస్థీకరించిన ఆంధ్రప్రదేశ్‌కు 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు ప్రస్తుతం ఉన్నాయి. తెలంగాణ వాదనను పరిగణలోకి తీసుకుని కేంద్రం వెలువరించిన నిర్ణయంతో ఇప్పుడు రాష్ట్రానికి కేటాయించిన 512 TMCల నీటిపై హక్కులను ఏపీ మళ్లీ నిరూపించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.


బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయింపులకు ప్రస్తుతం ఉన్న బ్రిజేష్‌కుమార్‌ ట్రైబ్యునల్‌ రక్షణ కల్పిస్తూ ఇప్పటికే నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం ఇంకా గెజిట్‌లో ప్రచురించలేదు. అవార్డు పాస్‌ కాలేదు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నీటి కేటాయింపులు పునఃసమీక్షించేందుకు మరో కొత్త ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ డిమాండ్‌ చేస్తూ వచ్చారు. సుప్రీంకోర్టులోనూ కేసు దాఖలు చేశారు. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్‌ అభ్యంతరాలను ఇప్పటి వరకు ఏ వేదిక మీదా ముఖ్యమంత్రి జగన్‌ గట్టిగా వినిపించలేకపోయారు. కొత్త ట్రైబ్యునల్‌కు వ్యతిరేకంగా ముఖ్యమంత్రి ప్రధాని వద్ద, కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ వద్ద ఏనాడూ తన వాదన వినిపించలేదు.


ఇటు తెలంగాణలో పసుపుబోర్డు, గిరిజన వర్సిటీ ఏర్పాటుకు ఆమోదం తెలిపింది. పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు ఎగుమతుల పెంపు, అంతర్జాతీయంగా కొత్త మార్కెట్లను అభివృద్ధి చేయడానికి ఈ బోర్డు సహాయపడుతుందని అనురాగ్ ఠాకూర్ తెలిపారు. ప్రస్తుతం భారత్ 16 వందల కోట్ల విలువైన పసుపును ఎగుమతి చేస్తోందని... దీన్ని 8 వేల 400 కోట్లకు పెంచాలన్న లక్ష్యంతో ఉన్నామని ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే జాతీయ పసుపు బోర్డు ఏర్పాటు అవసరమని వివరించారు. తెలంగాణలో సమ్మక్క సారక్క కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్టు చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story