T-Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో కలహం.. కమదళానికి అనుకూలం

T-Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో కలహం.. కమదళానికి అనుకూలం
T-Congress: పిట్ట పోరు పిల్లికి లాభం అన్నచందాన కాంగ్రెస్‌లో రాజుకున్న కలహాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోంది కమలదళం.

T-Congress: పిట్ట పోరు పిల్లికి లాభం అన్నచందాన కాంగ్రెస్‌లో రాజుకున్న కలహాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలనుకుంటోంది కమలదళం. పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిని వ్యతిరేకిస్తున్న వారిపైనా, కాంగ్రెస్‌లో ఇమడలేకపోతున్న వారిపైనా బీజేపీ ఫోకస్‌ పెట్టింది.



పార్టీ మారాలనుకుంటున్న నేతలెవరో వెతుకుతోంది. ఇప్పటికీ కాంగ్రెస్‌ నేతలను భారీగానే ఆకర్షిస్తున్నాయి టీఆర్‌ఎస్, బీజేపీ. ప్రస్తుతం ఈ రెండు పార్టీల మధ్య పోటీ ఉండడంతో.. ఒక అడుగు తామే ముందు ఉండాలని భావిస్తోంది బీజేపీ. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత కలహాలు నడుస్తుండడంతో.. ఈ పరిణామాన్నే తమకు అనుకూలంగా మలచుకోవాలని బీజేపీ భావిస్తోంది. అసంతృప్త నేతలను అక్కున చేర్చుకోవాలని పావులు కదుపుతోంది.


తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలపై బీజేపీ హైకమాండ్‌ ఫోకస్‌ పెట్టింది. ప్రధానంగా మోదీ.. తెలంగాణపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే, రాష్ట్ర బీజేపీ నేతలు ఎప్పటికప్పుడు అధిష్ఠానానికి నివేదికలు పంపుతున్నారు.



హస్తం పార్టీలో కలహాలను ఉపయోగించుకుని సాధ్యమైంత త్వరగా కాంగ్రెస్‌ నుంచి కొందరు కీలక నేతలను తమ పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ జాతీయ నాయకత్వం భావిస్తోంది. వారిని బీజేపీలోకి రప్పించే బాధ్యతను కోమటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డికి అప్పగించినట్లు తెలుస్తోంది.



అందుకే, రాజగోపాల్‌రెడ్డి సైతం.. కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి రావాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం తెలంగాణలో అధికారం చేజిక్కించుకోవాలంటే.. బీజేపీకి ఉన్న నేతల బలం సరిపోదని ఆ పార్టీ భావిస్తోంది. అందుకే, ప్రతి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలోని బలమైన నేతల్ని గుర్తించే పనిలో పడ్డారు బీజేపీ బాసులు.


మరోవైపు, సొంతంగా పార్టీ బలోపేతం పైనా బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇందులో భాగంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేస్తున్న ప్రజాసంగ్రామ యాత్రను అధిష్టానం నిశితంగా గమనిస్తోంది. బండి సంజయ్ పాదయాత్ర వీడియోను ఢిల్లీ బీజేపీ నేతలు పరిశీలించారు.



బీజేపీ ఎంపీల సమావేశంలో ఈ వీడియోను ప్రదర్శించనున్నారు. సంజయ్‌ నిర్వహిస్తున్న పాదయాత్రకు నరేంద్రమోదీ ఎప్పుడో కితాబు ఇచ్చారు. యాత్రకు వివిధ వర్గాల నుంచి వస్తున్న స్పందన ఇతర రాష్ట్రాలకు ప్రేరణగా ఉంటుందన్న అభిప్రాయాన్ని ప్రధాని మోదీ వ్యక్తం చేశారు.



సంజయ్‌ పాదయాత్రకు సంబంధించి ప్రజల నుంచి వచ్చిన వినతులపై తనకు నివేదిక ఇవ్వాలని మోదీ అడిగినట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. అంతేకాదు, పార్లమెంటరీ పార్టీ సమావేశంలో బండి సంజయ్ పాదయాత్రకు సంబంధించి పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ఇవ్వాలని ప్రధాని మోదీ.. ఎంపీ డాక్టర్‌ లక్ష్మణ్‌కు సూచించారు. దీంతో ఐదు విడతల పాదయాత్రకు సంబంధించిన 15 నిమిషాల నిడివితో కూడిన వీడియోను రాష్ట్ర బీజేపీ నేతలు సిద్ధం చేశారు.


మొత్తంగా కాంగ్రెస్‌లో జరుగుతున్న పరిణామాలను అవకాశంగా తీసుకుని, మరింత బలపడాలని బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. అటు తెలంగాణలో సొంతంగా ఎదిగేందుకు సైతం ప్రణాళికలు రచిస్తోంది. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ సర్కారును దించాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ.. వచ్చిన ఏ అవకాశాన్ని జారవిడుచుకోదలుచుకోలేదు.

Tags

Read MoreRead Less
Next Story