TS : కవితపై ఈడీ అభియోగాలు ఇవే

TS : కవితపై ఈడీ అభియోగాలు ఇవే

దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ప్రకంపనలు రేపుతూనే ఉంది. లేటెస్ట్ గా తెలంగాణ కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవిత (Kavitha) ఈ స్కామ్ లో అరెస్ట్ కావడంతో మరోసారి సంచలనం సృష్టించింది. ఢిల్లీ మద్యం పాలసీలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అసలైన పెట్టుబడిదారు అని.. ఆమె బినామీగా వ్యవహరించిన అరుణ్‌ పిళ్లై తన వాంగ్మూలంలో ఈ విషయాన్ని స్పష్టంగా పేర్కొన్నారని ఈడీ గతంలో దాఖలు చేసిన అనుబంధ చార్జిషీట్‌లో పేర్కొంది. రూ.100 కోట్ల లంచాల గురించి కవితకు తెలుసని పిళ్లై అంగీకరించారని తెలిపింది.

సౌత్‌ గ్రూప్‌ శరత్‌రెడ్డి, మాగుంట శ్రీనివాసులురెడ్డి, రాఘవ మాగుంట, కె.కవిత తరఫున ప్రాతినిధ్యం వహించిన అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి, బుచ్చిబాబుతో కలిసి మనీశ్‌ సిసోడియా, ఇతర ఆప్‌ నేతల ప్రతినిధి విజయ్‌నాయర్‌ ఈ లిక్కర్ లంచాల కుట్ర చేశారని ఈడీ వివరించింది. మద్యం విధానం రూపకల్పనకు ముందు, తర్వాత కూడా విజయ్‌నాయర్‌తో కవిత పలుసార్లు సమావేశమయ్యారు. సమీర్‌ మహేంద్రు వాంగ్మూలం ప్రకారం.. తన వెనక ఎవరున్నారో చెప్పాలని అడగ్గా తెలంగాణ సీఎం కేసీఆర్‌ కుమార్తె ఎమ్మెల్సీ కవిత అని సమీర్‌కు అరుణ్‌ పిళ్లై వెల్లడించారు.

ఈడీ కథనం ప్రకారం.. 2022 తొలినాళ్లలో హైదరాబాద్‌లోని కవిత నివాసంలో జరిగిన సమావేశంలో ఆమెతోపాటు సమీర్‌ మహేంద్రు, శరత్, అరుణ్‌ పిళ్లై, అభిషేక్‌ బోయినపల్లి, కవిత భర్త అనిల్‌ పాల్గొన్నారు. అరుణ్‌పిళ్లై తన కుటుంబ సభ్యుడితో సమానమని, అతడితో కలసి వ్యాపారం చేస్తున్నామని, తమ వ్యాపారాన్ని భారీగా ముందుకుతీసుకెళ్లాలని భావిస్తున్నామని సమీర్‌కు కవిత తెలిపారు. ఈ సమయంలోనే ఇండోస్పిరిట్స్‌ ఎల్‌1 దరఖాస్తు సమస్యపై కవిత ఆరా తీశారు. రూ.100 కోట్ల ముడుపులకు బదులుగా కవితకు ఇండోస్పిరిట్స్‌లో వాటా ఇవ్వడంపై.. ఆమెకు, ఆప్‌ నేతలకు మధ్య అవగాహన ఒప్పందం ఉందని అరుణ్‌ పిళ్లై తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఢిల్లీ మద్యం వ్యాపారంలో వచ్చిన సొమ్ముతో కవిత సహా మిగతా నిందితులు హైదరాబాద్‌లో ప్రాపర్టీలు కొన్నారని ఈడీ తెలిపింది. ఫీనిక్స్‌ శ్రీహరితో కలిసి కవిత భర్త అనిల్, బుచ్చిబాబు హైదరాబాద్‌లో ప్రాపర్టీలు కొన్నారని ఈడీ చార్జిషీట్ లో వివరించింది.

Tags

Read MoreRead Less
Next Story