Top

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. పార్టీ ఏదైనా మూసీనే టార్గెట్

జీహెచ్‌ఎంసీ ఎన్నికలు.. పార్టీ ఏదైనా మూసీనే టార్గెట్
X

మూసీ కంపు పోవాలంటే తమకే ఓటెయ్యాలనే నినాదం 2016లో మొదలైంది. అప్పట్లో ఇదే హామీతో గెలిచిన టీఆర్ఎస్.. 2020 మేనిఫెస్టోలో కూడా చేర్చింది. టీఆర్ఎస్‌తో పాటు బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ సైతం మూసీనే టార్గెట్ చేసుకుంది. తాగునీటి గోసకు కారకులు మీరంటే మీరేనంటూ పార్టీలు పరస్పరం దూషించుకున్నాయి. రోజు విడిచి రోజు నీళ్లు ఇస్తున్నామని అధికార పార్టీ చెబుతుంటే.. బస్తీల్లో ఇప్పటికీ తాగునీటి కష్టాలు తీర్చలేకపోయారని కాంగ్రెస్ ఎత్తిచూపుతోంది. ఇవన్నీ పక్కనపెడితే వరద సాయంపై వేలం పాట నడిచింది. టీఆర్ఎస్ పదివేలు ఇస్తామంటే, బీజేపీ పాతిక వేలు ఇస్తామంది. కాంగ్రెస్ అయితే ఏకంగా 50వేలు ఇస్తామని హామీ ఇచ్చింది. ఇక అక్రమ కట్టడాలు, ఉచిత నీళ్లు, ఉచిత కరెంటు కామన్‌గా కనిపిస్తున్నాయి.

మరోసారి మేయర్ పీఠాన్ని అప్పగిస్తే.. ఏమేం చేస్తామో చెప్పుకొచ్చింది టీఆర్ఎస్. నెలకు 20వేల లీటర్ల వరకు నల్లా నీళ్లు ఫ్రీ, సెలూన్లు, లాండ్రీలు, ధోబీఘాట్‌లకు కరెంటు ఫ్రీ, 13వేల కోట్లతో నాలాల అభివృద్ధి, వృద్ధులకు ఉచిత బస్‌పాసులు, హైదరాబాద్ నాలుగు దిక్కులా ఐటీ వెలుగులు, అర్హులైన వారందరికీ రేషన్‌కార్డులు, పింఛన్లు, మార్చి నుంచి సెప్టెంబరు వరకు కనీస విద్యుత్తు ఛార్జీలు రద్దు, రాయదుర్గం నుంచి ఎయిర్‌పోర్టు వరకు.. బీహెచ్‌ఈఎల్‌ నుంచి మెహిదీపట్నం వరకు మెట్రో రైలు, మరో 90 కిలోమీటర్ల మేర ఎంఎంటీఎస్‌ రైళ్లు, సిగ్నల్‌ఫ్రీగా హైదరాబాద్ రోడ్లు, ఎలివేటెడ్‌ బీఆర్‌టీఎస్, స్కైవాక్‌లు, సైకిల్‌ట్రాక్‌లు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది టీఆర్ఎస్.

ఒక్కసారి అవకాశం ఇవ్వండని అడుగుతోంది బీజేపీ. అధికారం ఇస్తే.. వరద బాధితులకు పాతిక వేల రూపాయల ఆర్థిక సాయం, ఇంటింటికీ నల్లా కనెక్షన్‌.. 24 గంటల ఉచిత మంచినీరు, అందరికీ కరోనా వ్యాక్సిన్‌, పాతబస్తీ అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ, పాతబస్తీలో ప్రతి డివిజన్‌కు 4 కోట్లకు తగ్గకుండా నిధులు, ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు, అక్రమ నిర్మాణాల కూల్చివేత, లక్ష మంది పేదలకు ప్రధాని ఆవాజ్‌ యోజన కింద ఇళ్లు, వీధి వ్యాపారులకు ఆరోగ్య బీమా, మెట్రో రైలు, సిటీబస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం, టూవీలర్లు, ఆటోలపై చలాన్లు రద్దు, కులవృత్తులకు ఉచిత విద్యుత్‌, ఎస్సీ కాలనీలు, బస్తీల్లో ఆస్తిపన్ను మాఫీ, పేదలకు వందయూనిట్ల లోపు ఉచిత విద్యుత్‌, గ్రేటర్‌లో అన్ని ప్రాంతాలకు మెట్రో రైలు, ఎంఎంటీఎస్‌ సేవలు, జంక్షన్‌కో ఫ్లైఓవర్, జీహెచ్‌ఎంసీలో 28 వేల ఉద్యోగాలు, జీహెచ్‌ఎంసీ కార్మికులకు పన్నుల మాఫీ, మూసీ ఫ్రంట్‌ డెవెలప్‌మెంట్‌ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చింది.

గ్రేటర్ వార్‌లో కాస్త వెనకబడినట్టు కనిపిస్తున్న కాంగ్రెస్.. ధాటిగానే మేనిఫెస్టో ప్రకటించింది. వరద బాధితులకు 50వేలు, వ‌ర‌ద‌ల్లో చ‌నిపోయిన వారి కుటుంబానికి 25 ల‌క్ష‌లు ఇస్తామన్న హామీ హైలెట్‌గా నిలిచింది. వీటితో పాటు ఆరోగ్యశ్రీ పథకంలో కరోనా చికిత్స, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, ధరణి రద్దు, 30వేల లీటర్ల ఉచిత మంచినీరు, సిటీ మొత్తం మెట్రో, ఎంఎంటీఎస్ స‌ర్వీసులు, మహిళలు, విద్యార్ధులు, దివ్యాంగులు, వృద్దులకు ఆర్టీసి, మెట్రో, ఎంఎంటిఎస్‌లో ఉచిత ప్రయాణం, అర్హత కలిగి ఇళ్లులేని వారందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఆస్తి పన్నులో రాయితీ, 100 యూనిట్ల లోపు విద్యుత్ రాయితీ, క్షురకులు, రజకులు, వడ్రంగులు, విశ్వకర్మల దుకాణాలకు ఆస్తి పన్ను, విద్యుత్ బిల్లు మాఫీ, ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్, ధరణి రద్దు, ఉచితంగా 30వేల లీటర్ల మంచినీళ్లు, కరోనాతో దెబ్బతిన్న రంగాలకు నిరుద్యోగ అలవెన్స్‌లు, వీధి వ్యాపారులకు ఆరోగ్య, ప్రమాద బీమా, నాలా ఆక్రమణల తొలగింపు చేస్తామని హామీ ఇచ్చింది.

గ్రేటర్‌లో తన స్థానం ఏంటో పరీక్షించుకుంటున్న టీడీపీ కూడా ఒక్క ఛాన్స్ అడుగుతోంది. హ్యాపీ హైదరాబాద్‌ పేరుతో మేనిఫెస్టో విడుదల చేసింది. ఎల్‌ఆర్‌ఎస్‌ రద్దు, ఆస్తిపన్ను తగ్గింపు, ఇంటింటికీ మంచినీటి సరఫరా, పేదలందరికీ ఉచిత నల్లా కనెక్షన్‌, ప్రతీ ఇంటికి పైపులైన్ల ద్వారా గ్యాస్‌ సరఫరా, పేద కుటుంబాలకు పక్కా గృహ నిర్మాణం, అవసరమైన ప్రతీచోట ఫ్లైఓవర్‌ల నిర్మాణం, ప్రజా రవాణా మెరుగుకు బీఆర్‌టీఎస్‌, నగరవ్యాప్తంగా 200 నీటిశుద్ధి ప్లాంట్లు, సబర్మతీ తీరం మాదిరిగా మూసీనదికి పునరుజ్జీవం, బాపూఘాట్‌ నుంచి నాగోల్‌ వరకు మూసీకి సమాంతరంగా రోడ్లు, ఎంఎంటీఎస్‌, మెట్రో, ఆర్టీసీలో ప్రయాణానికి సింగిల్‌ కార్డు, 200 గజాలలోపు స్థలాల్లో భవన నిర్మాణాలకు అనుమతుల సడలింపు, హైదరాబాద్‌ కోసం ప్రత్యేకంగా 600 మెగావాట్ల విద్యుత్‌ కేంద్రం నిర్మిస్తామని మేనిఫెస్టోలో చేర్చింది.

Next Story

RELATED STORIES