Prisoner : నాలుగు వేల మంది ఖైదీలు జైలు నుంచి జంప్

Prisoner : నాలుగు వేల మంది ఖైదీలు జైలు నుంచి జంప్

ఒకేసారి నాలుగువేల మంది ఖైదీలు జైలు నుంచి పారిపోయిన ఘటన కరీబియన్‌ దేశం హైతీలో జరిగింది. హైతీలో నేరగాళ్ల ముఠాలు చెలరేగాయి. రాజధాని నగరం 'పోర్ట్‌ ఔ ప్రిన్స్‌'లో కలకలం క్రియేట్ చేశాయి. పోర్ట్‌ ఔ ప్రిన్స్‌ నగరంలోని రెండు ప్రధాన జైళ్లపై సాయుధ ముఠాలు దాడికి తెగబడ్డాయి. దీంతో వాటిలోని దాదాపు 4వేల మంది ఖైదీలు తప్పించుకొని పరారయ్యారు.

రక్షణ రంగ ఒప్పందం కోసం హైతీ ప్రధానమంత్రి ఏరియల్‌ హెన్రీ కెన్యా పర్యటనకు వెళ్లిన తరుణంలో నేరగాళ్ల ముఠాలు కలిసికట్టుగా జైళ్లపై దాడి చేసి ఖైదీలను విడిపించుకున్నారు. ఈసందర్భంగా రాజధాని నగరంలో ఉద్రిక్తత ఏర్పడింది. లక్షలాది మంది ప్రజలు భయంతో ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. నగరంలో పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. కాల్పుల్లో ఇరువర్గాలకు చెందిన పలువురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో 72 గంటల అత్యవసర ఎమర్జెన్సీని ప్రకటించారు.

వాస్తవానికి శనివారం అర్ధరాత్రి నాటికే ఇదంతా జరిగిపోయింది. అంతర్జాతీయ మీడియా ద్వారా ఈవిషయం వెలుగులోకి రావడంలో చాలా ఆలస్యం జరిగింది. తాజా దాడుల వెనుక 'బాజ్‌-5' ముఠా హస్తం ఉందని అనుమానిస్తున్నారు. జైలుకు సంబంధించిన పలు వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. జైళ్ల నుంచి బయటికొస్తున్న ఖైదీలు రాజధాని నగరంలోని పోలీస్‌ స్టేషన్లు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, జైళ్లను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలుస్తోంది. హైతీలో ఉన్న అమెరికా పౌరులకు ఇప్పటికే ఆ దేశం భద్రతా పరమైన హెచ్చరికలు జారీ చేసింది.

Tags

Read MoreRead Less
Next Story