వైసీపీలో వర్గపోరు..అధికారంలోకి రాక ముందే నేతల మధ్య విభేదాలు

చిత్తూరు వైసీపీలో వర్గపోరు మరోసారి భగ్గుమంది. అధికారంలోకి రాక ముందు నుంచి పార్టీ నేతల మధ్య విభేదాలు, అధికారంలోకి వచ్చిన తర్వాత కొనసాగుతున్నాయి. చిత్తూరులో తాగునీటి సమస్యలు పరిష్కరించాలంటూ రెండు వర్గాలు వేర్వేరుగా కమిషనర్‌కు వినతి పత్రాలు సమర్పించడంతో నాయకుల మధ్య అగాధం ఇంకోసారి బయటపడింది.

మొన్నటి ఎన్నికల్లో చిత్తూరు జిల్లాలో కుప్పం మినహా అన్ని నియోజకవర్గాలను వైసీపీ కైవసం చేసుకుంది. అయితే చిత్తూరులో ద్వితీయ శ్రేణి నాయకుల్లో తీవ్ర మనస్పర్థలున్నాయి. తాజాగా నీటి సమస్య విషయంపై వైసీపీ చిత్తూరు పట్టణ అధ్యక్షుడు చంద్రశేఖర్, ఎన్నికల ముందు పార్టీలో చేరిన బెల్లెట్‌ సురేశ్‌లు వేర్వేరుగా కమిషనర్‌కు ఓబులేస్‌కు వినతి పత్రాలు సమర్పించారు. దీంతో నేతల మధ్య విభేదాలు మరోసారి బయటపడ్డాయి.

వైసీపీ అధికారంలోకి వస్తే, చంద్రశేఖర్ కు మేయర్‌ పదవి ఇస్తారని ఎప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది. దీనికి పార్టీ అధిష్టానం నుంచి కూడా సానుకూల వాతావరణమే కనిపిస్తోంది. అయితే బెల్లెట్‌ సురేశ్‌ మేయర్ పదవి హామీతోనే పార్టీలో చేరినట్టు సమాచారం. వైసీపీ అధికారంలో లేనప్పుడు ప్రజాసమస్యలపై గ్రూప్ లు గానే ధర్నాలు చేసేవారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక కూడా పరిస్థితిలో మారలేదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే జంగాలపల్లె శ్రీనివాసులు కలుగు చేసుకొని గ్రూప్‌ తగాదాలను తొలగించాలని కార్యకర్తలు కోరుతున్నారు. లేకుంటే భవిష్యత్‌లో పార్టీకి తీవ్ర నష్టమని చెబుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story