ఆంధ్రప్రదేశ్

గందరగోళానికి తెర.. ప్రతి తల్లికీ రిపబ్లిక్ డే నాడు రూ. 15 వేలు

గందరగోళానికి తెర.. ప్రతి తల్లికీ రిపబ్లిక్ డే నాడు రూ. 15 వేలు
X

గందరగోళానికి తెరపడింది.. అమ్మ ఒడి పథకాన్ని అందరికీ అమలు చేయనుంది ఏపీ ప్రభుత్వం.. ప్రభుత్వ స్కూళ్లకే వర్తింపజేయాలని భావించగా.. దీనిపై మిశ్రమ స్పందన వచ్చింది.. దీంతో ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రైవేటు స్కూళ్లకూ వర్తింప చేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంపై హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న అమ్మఒడి పథకంపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చింది. ఈ పథకం ద్వారా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మాత్రమే లబ్ధి చేకూరుతుందన్న ప్రచారం ఇప్పటి వరకు జరిగింది. అయితే, ఈ సందేహాలకు తెరదించుతూ ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ, ప్రైవేట్ అనే తేడా లేకుండా బడికి వెళ్లే పిల్లలందరికీ ఈ స్కీమ్ ను వర్తింపజేయనున్నట్లు సీఎంవో స్పష్టం చేసింది.

అక్షరాస్యత పెంచడమే అమ్మఒడి పథకం లక్ష్యం. దేశం మొత్తం నిరక్షరాస్యుల సగటు 26 శాతం ఉండగా.. ఏపీలో 33 శాతంగా ఉంది.. ఈ పరిస్థితిని మార్చేందుకు పేద కుటుంబాల్లోని పిల్లలు కూడా చదువుకునే విధంగా జగన్‌ ఈ పథకాన్ని తీసుకొచ్చారు.. ప్రతి పేద విద్యార్థి తల్లికి అమ్మఒడి పథకం కింద 15వేలు ఇస్తామని ఎన్నికల ప్రచారం సందర్భంగా జగన్‌ హామీ ఇచ్చారు. ఇదే అంశాన్ని మేనిఫెస్టోలోనూ ప్రముఖంగా పేర్కొన్నారు.. ఈ నేపథ్యంలో ప్రభుత్వ, ప్రేవేటు పాఠశాలలకు అమ్మఒడి పథకం వర్తిస్తుందని.. లబ్ధిదారుల ఎంపికకు పేదరికమే కొలమానం అని ముఖ్యమంత్రి కార్యాలయం స్పష్టం చేసింది. తెల్ల రేషన్ కార్డు కలిగి ఉండి ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలను చదివించే ప్రతీ తల్లికీ రిపబ్లిక్ డే నాడు 15 వేల రూపాయల సాయం అందించనున్నారు.

మరోవైపు పథకం అమలుకు శ్రీకారం చుట్టేలోగానే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలల స్థితిగతుల్ని, రూపు రేఖల్ని మార్చాలని ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయించారు.. ప్రభుత్వ పాఠశాలలను మెరుగుపరిచే దిశగా అన్ని చర్యలు త్వరలో ప్రారంభం కాబోతున్నాయని ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది.

Next Story

RELATED STORIES