ఆంధ్రప్రదేశ్

టీడీపీని వీడేది లేదు.. కులాల వారీగా కూర్చుంటే తప్పు ఏంటి

టీడీపీని వీడేది లేదన్నారు ఆ పార్టీ కాపు నేతలు. పార్టీపై ఎలాంటి అసంతృప్తి లేదని, కులాల వారీగా కూర్చుంటే తప్పు ఏంటని ప్రశ్నించారు. టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తమ ముందున్న లక్ష్యమని స్పష్టం చేస్తున్నారు.

ఇటీవల కాకినాడలో జరిగిన కాపు నేతల సమావేశం తెలుగుదేశం పార్టీలో కలకలం సృష్టించింది. పార్టీ అధినేత చంద్రబాబు విదేశాల్లో ఉండగా ఈ భేటీ జరగడం పొలిటికల్‌ హీట్‌ పెంచింది. చంద్రబాబు విదేశాల నుంచి తిరిగి వచ్చిన తర్వాత జరిగిన సమావేశానికి బొండా ఉమా వంటి కొందరు కాపు నేతలు డుమ్మా కొట్టడంతో వారు అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరిగింది. అయితే ఇదంతా టీ కప్పులో తుపాన్‌లా తేలిపోయింది.

కాపు నేతలు సోమవారం పార్టీ అధినేత చంద్రబాబుతో సమావేశమయ్యారు. అంతకు ముందు బొండా ఉమా నివాసంలో భేటీ అయ్యారు. అక్కడి నుంచి చంద్రబాబు దగ్గరికి వెళ్లారు. తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించారు. కాకినాడ, విజయవాడ సమావేశాల అజెండాను పార్టీ అధినేత దృష్టికి తీసుకెళ్లారు. కాపు నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగడతామన్నారు కాపునేతలు. కులాల వారీగా కూర్చుంటే తప్పు ఏంటని ప్రశ్నించారు. టీడీపీని మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే తమ ముందున్న లక్ష్యమని తెలిపారు. చంద్రబాబు వెంటే తామంతా నడుస్తామని, ఎట్టి పరిస్థితుల్లోను టీడీపీని వీడబోమని స్పష్టం చేశారు.

జనసేన వల్ల టీడీపీకి నష్టం జరిగిందన్నారు కాపునేతలు. పార్టీతో దూరమైన ఓటు బ్యాంకును తిరిగి పొందుతామని తెలిపారు. జనసేనతో పొత్తు అంశం భవిష్యత్‌లో తెలుస్తుందని చెప్పారు.జగన్ సర్కారు తీసుకునే ప్రజావ్యతిరేక కార్యక్రమాలను అడ్డుకుని తీరుతామంటున్నారు కాపునేతలు. రానున్న రోజుల్లో టీడీపీని బలోపేతం చేసి, తిరిగి అధికారంలోకి తీసుకొస్తామని స్పష్టం చేస్తున్నారు.

Next Story

RELATED STORIES