ఇసుక తవ్వకాలు.. సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు

ఏపీలో ఇసుక తవ్వకాలు, పంపిణీపై సమీక్ష నిర్వహించిన సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇసుక వారోత్సవాలను నిర్వహించాలని నిర్ణయించారు. వారం రోజులపాటు ఇదే అంశంపై పనిచేసి.. ఇసుక కొరత గురించి మళ్లీ ఎవరూ మాట్లాడకుండా చూడాలని సీఎం ఆదేశించారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రతిపక్ష పార్టీ నేతలు పనిగట్టుకుని విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పళ్లు ఇచ్చే చెట్టుపైనే రాళ్లు వేస్తున్నారని అన్నారు జగన్. గత ప్రభుత్వ హయాంలో వ్యవస్థ మొత్తం అవినీతి మయమైందని... ఇప్పుడు పూర్తిగా ప్రక్షాళన చేస్తున్నామని చెప్పారు. ఎక్కడైనా అక్రమాలు జరిగితే అడ్డుకోవాలని కలెక్టర్, ఎస్పీలను ఆదేశించామన్నారు. అయితే ఇసుక తవ్వకాలను అవినీతికి దూరంగా పెట్టగలిగామని గర్వంగా చెప్పగలనని వ్యాఖ్యానించారు జగన్. గతంలో ఎప్పుడూ లేని విధంగా వరదలు వస్తున్నాయని అన్నారు. దోచేసిన ఇసుక స్థానంలో కొత్త ఇసుక వచ్చి చేరడం కూడా మంచిదేనని చెప్పారు. వరదల వల్ల ఇసుక ఆశించిన స్థాయిలో తీయలేకపోతున్నామని వివరించారు. వచ్చే వారానికి వరదలు తగ్గుతాయని భావిస్తున్నామన్నారు జగన్.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com