వైసీపీ.. ప్రజల పాలిట మరణశాసనం రాసింది: చంద్రబాబు


ఏపీలో ఇసుక కొరత పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనన్నారు చంద్రబాబు. విజయవాడ ధర్నాచౌక్‌లో నిరసన దీక్షకు దిగిన ఆయన.. సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ఇంటిదొంగలే ఈ పరిస్థితికి కారణమన్నారు. సిమెంట్ కంపెనీలతో కమీషన్ల కోసం బేరసారాలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇంత సంక్షోభం ఉన్నా.. కొందరు యధేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 35 లక్షల కుటుంబాలు పూట తిండి లేకుండా ఇబ్బంది పడడానికి YCP ప్రభుత్వమే కారణమన్నారు. ఇసుక సమస్యపై పవన్ లాంగ్ మార్చ్ చేస్తే వ్యక్తిగత విమర్శలు చేయడం దారుణమన్నారు.
టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత ఇసుక పాలసీని కాదని.. కొత్త విధానం తెస్తామని చెప్పిన YCP చివరికి ఓటు వేసిన ప్రజల పాలిట మరణశాసనం రాసిందన్నారు చంద్రబాబు. తాను 11 మంది ముఖ్యమంత్రుల్ని చూసినా ఇంత వైఫల్యం ఎప్పుడూ లేదన్నారు. ఉపాధి లేక ఆత్మహత్యలు చేసుకున్న భవన నిర్మాణ కార్మికుల కుటుంబాలకు 25 లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు. ఉపాధి కోల్పోయిన వారికి ఈ ఐదు నెలలకు 10 వేల భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుక సమస్యకు పరిష్కారం కావాలంటే ఉచితంగానే ఇవ్వాలన్నారు.
పోలీసులకు స్వేచ్ఛ ఇస్తే 24 గంటల్లో ఇసుక మాఫియాను అడ్డుకుంటారని చంద్రబాబు అన్నారు. వాళ్ల చేతులు కట్టేసి ప్రజల ముందు దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేయడం సరికాదన్నారు. 50 మంది కార్మికులు చనిపోయినా ప్రభుత్వం స్పందించకపోవడం దారుమన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

