టీడీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూములను వైసీపీ నేతలు లాక్కుంటున్నారు: చంద్రబాబు


చింతమనేని ప్రభాకర్‌పై వైసీపీ తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. అందులో 11 కేసులకు గాను.. 9 కేసులు ఎస్‌సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులే పెట్టారని ఆరోపించారు. పశ్చిమ గోదావరిలో 2వ రోజు చంద్రబాబు సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం 6 నియోజక వర్గాల ఇన్‌ఛార్జ్‌లతో తణుకులో చంద్రబాబు సమావేశమయ్యారు. పోలవరం, ఉంగుటూరు, కొవ్వూరు, నిడదవోలు, నర్సాపురం, ఆచంట నియోజకవర్గాల నేతలతో క్షేత్రస్థాయిలో పరిస్థితులపై చర్చించి.. క్యాడర్‌కు ఎదురవుతున్న ఇబ్బందుల పరిష్కారంపై దృష్టి పెట్టారు. స్థానిక ఎన్నికల్లో సత్తా చాటేలా దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా కార్యకర్తలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన చంద్రబాబు.. వైసీపీ పాలనపై నిప్పులు చెరిగారు. జిల్లాలో చాలా చోట్ల టీడీపీ కార్యకర్తలపై కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. దీనిపై ప్రైవేటు కేసులు వేస్తామని కార్యకర్తలకు చంద్రబాబు భరోసా ఇచ్చారు. జిల్లా ఎస్పీ పేదవారికి అండగా ఉంటారా..? దౌర్జన్యానికి అండగా ఉంటారా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వం పేదలకు ఇచ్చిన భూమిని వైసీపీ వాళ్లు బలవంతంగా లాక్కుంటున్నారని చంద్రబాబు ఆరోపించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

