ప్రతీ లబ్ధిదారుడి ఇంటికి నాణ్యమైన బియ్యాన్ని అందించాలి: సీఎం జగన్

ప్రతి లబ్ధిదారుడి ఇంటికి నాణ్యమైన బియ్యాన్ని ప్యాక్ చేసి అందించాలని ఏపీ సీఎం జగన్.. అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి బియ్యం సేకరణ, ప్యాకేజ్డ్ యూనిట్ల ఏర్పాటు, గోదాముల్లో బియ్యాన్ని భద్రపరుస్తున్న తీరు వంటి అంశాలపై జగన్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాకుళంలో అమలవుతున్న పైలట్ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను అధికారులు ముఖ్యమంత్రికి నివేదించారు. నాణ్యమైన, ప్యాకేజ్డ్ బియ్యంపై ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందని అధికారులు వివరించారు.
వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి మిగిలిన అన్ని జిల్లాల్లో ప్యాకేజ్డ్ బియ్యం పంపిణీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. బియ్యం నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడకూడదన్నారు. ప్రతి దశలోనూ నాణ్యతను పరిశీలించే అవకాశం ఉండాలని.. ఎక్కడా అలసత్వానికి దారితీయకుండా అన్ని జాగ్రత్తలు పాటించాలని ఆదేశించారు. అలాగే బియ్యాన్ని పంపిణీ చేస్తున్న ప్లాస్టిక్ బ్యాగులను తిరిగి వెనక్కి ఇచ్చేలా ప్రజలకు అవగాహన కల్పించాలని, లేకుంటే పర్యావరణం దెబ్బతింటుందని సీఎం జగన్ అధికారులకు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com