నిజం మాట్లాడితే వైసీపీకి భయం: చంద్రబాబు

నిజం మాట్లాడితే వైసీపీకి భయం: చంద్రబాబు
X

babu

మీడియాపై ఆంక్షల అంశం మరోసారి ఏపీ అసెంబ్లీ లోపల, బయట తీవ్ర ఉద్రిక్తతలకు కారణమైంది. 2430 జీవోను రద్దుచేయాలని, టీవీ ఛానళ్లపై ఆంక్షలు ఎత్తేయాలని టీడీపీ ఆందోళనకు దిగింది. మీడియా గొంతు నొక్కడం సరికాదంటూ చంద్రబాబు బృందం గవర్నర్‌కు పిర్యాదు చేసింది.

మీడియాపై ఆంక్షలు, జీవో 2430 రద్దు చేయాలని కోరుతూ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. మీడియా గొంతు నొక్కడం సరికాదని అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే జీవో 2430ని వెంటనే రద్దుచేసి, అసెంబ్లీ ప్రసారాలకు అన్ని ఛానళ్లను అనుమతించాలి డిమాండ్ చేశారు చంద్రబాబు. నిజం చెప్పే మీడియా అన్నా.. ప్రభుత్వ తప్పులను నిగ్గదీసే టీడీపీ అన్నా వైసీపీకి భయమని ఆయన ధ్వజమెత్తారు.

సీఎం జగన్‌ సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని చంద్రబాబు ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేతలను అపహాస్యం చేస్తూ పైశాచికానందం పొందుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీలో స్పీకర్‌, మంత్రులు డమ్మీలుగా మారారని అన్నారు. తమను అడ్డుకునేందుకు 500మంది మార్షల్స్‌ ఎందుకు అని ప్రశ్నించారు. తామేమన్నా పులివెందుల నుంచి వచ్చామా? బాంబులు తెచ్చామా అంటూ నిలదీశారు..

అసెంబ్లీ నిర్వహించేది ప్రజా సమస్యల పరిష్కారానికా లేక తనను అవమానపరచడానికా అంటూ చంద్రబాబు ట్విట్టర్ వేదికగా నిలదీశారు. పదే పదే తనను 40 ఏళ్ల అనుభవం అని ఎగతాళి చేయడంపై మండిపడ్డ ఆయన 40 నిమిషాలు అసెంబ్లీ గేటు బైటే నిలబెట్టడం వంటివన్నీ వైసీపీ కావాలని చేస్తున్న కుట్రలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల కోసమే ఈ అవమానాలు, నిందలు భరిస్తున్నానన్న చంద్రబాబు పేదల అజెండా వదిలేసి.. ప్రతిపక్షం అణిచివేతే అజెండాగా పెట్టుకుంటే వైసీపీ పతనమేనని హెచ్చరించారు.

Tags

Next Story