రాజధాని అంశంపై జగన్ ప్రకటనతో వేడెక్కిన రాజకీయం

రాజధాని అంశంపై జగన్ ప్రకటనతో వేడెక్కిన రాజకీయం
X

JAGAN

ఆంధ్రప్రదేశ్ రాజధానిపై సాగుతున్న ఊహాగానాలకు అసెంబ్లీ సాక్షిగా సమాధానం ఇచ్చారు సీఎం జగన్. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాజధాని మార్పు తప్పదన్న వార్తలు జోరుగా వినిపించాయి. దీనికి తగ్గట్లుగానే సర్కార్‌ కూడా కేపిటల్ అంశంపై నిపుణుల కమిటీని నియమించింది. ఇప్పుడిదే అంశంపై సీఎం జగన్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు 3 రాజధానులు రావొచ్చు అంటూ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.

అభివృద్ధికి వికేంద్రీకరణ అవసరం అన్న జగన్.. సౌతాఫ్రికాకు 3 రాజధానులు ఉన్న అంశాన్ని ప్రస్తావించారు. కేపిటల్ పై వేసిన కమిటీ వారం రోజుల్లో నివేదిక ఇస్తుందని.. దాని ఆధారంగా త్వరలోనే నిర్ణయం ఉంటుందని స్పష్టం చేశారు. ఇంతకంటే మంచి సలహాలు, సూచనలు ఎవరైనా ఇస్తే తీసుకుంటామన్నారు జగన్.

ఏపీలో మూడు రాజధానులు ఉండొచ్చంటూ సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. కమిటీ నివేదిక రాకముందే రాజధానిపై ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించారాయన. రాబోయే రోజుల్లో రాష్ట్రాన్ని మరింత భ్రష్టు పట్టిస్తారని ఆరోపించారు. మూడు రాజధానులు ఏర్పాటు చేస్తే సీఎం ఎక్కడి నుంచి పరిపాలన చేస్తారని నిలదీశారు? ఇది తుగ్లక్ పాలన అంటూ విమర్శించారు.

ప్రభుత్వ తీరు చూస్తుంటే జిల్లాకో ఆఫీసు పెట్టేలా ఉన్నారని ఎద్దేవా చేశారు చంద్రబాబు. మూడు రాజధానుల్లో మంత్రులను ఏ రాజధానిలో పెడతారో చెప్పాలని ప్రశ్నించారు. సీఎం ప్రకటనతో ప్రాంతీయ విబేధాలు వస్తాయన్న చంద్రబాబు.. రాజధాని అంశాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామన్నారు.

మొత్తానికి సీఎం జగన్ ప్రకటనతో ఏపీకి అమరావతి ఒక్కటే రాజధానిగా ఉండదన్న అంశంలో పూర్తి క్లారిటీ వచ్చినట్లైంది. అయితే రాజధాని ప్రాంత రైతుల నుంచి సేకరించిన భూముల్ని ఏం చేస్తారు? వారికి ఎలా సమాధాన పరుస్తారన్నది ఆసక్తిని రేపుతోంది. ఇక కమిటీ ఎలాంటి రిపోర్టు ఇస్తుందన్నదానిపైనా మరో వారంలో పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

Tags

Next Story