జేసీ సంచలన వ్యాఖ్యలు.. చంద్రబాబులో మార్పు రావాలని సూచన

అనంతపురంలో జరిగిన టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. నేతలు, కార్యకర్తలకు కీలక సూచనలు చేసిన ఆయన వైసీపీ ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు. 3 రాజధానుల ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలే కానీ.. పరిపాలన కాదని అన్నారు. ఎన్నికలకు ముందు అమరావతికి సహకరిస్తామని చెప్పిన జగన్.. ఇప్పుడు మాట మార్చారని ఆరోపించారు. విశాఖ ప్రాంతంలో ఆస్తులుకొని డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీని మయసభతో పోల్చిన చంద్రబాబు.. వైసీపీ ఎమ్మెల్యేలు కౌరవుల మాదిరిగా వ్యవహరిస్తున్నారని అన్నారు. టీడీపీ నేతల్ని సస్పెండ్ చేసి.. రాజధాని ప్రకటన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఏపీలో దోపిడీ, అరాచక రాజ్యం సాగుతోందని చంద్రబాబు అన్నారు. అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందని ఆరోపిస్తున్నారని.. చేతనైతే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని సవాల్ విసిరారు. జగన్‌తో పనిచేసే అధికారులు జాగ్రత్తగా ఉండాలని.. కేసుల్లో ఇరుక్కుంటే ఎవ్వరూ కాపాడలేరని హెచ్చరించారు.
టీడీపీ నేతలపై అక్రమంగా 640 కేసులు పెట్టారని ఆరోపించారు చంద్రబాబు. జేసీ ఆర్థిక మూలాలు దెబ్బతీయాలని చూస్తున్నారని అన్నారు. పయ్యావుల కేశవ్ భూములు కొన్నారని అసత్య ప్రచారం చేశారని ఆరోపించారు. మళ్లీ కచ్చితంగా అధికారంలోకి వస్తామని.. వైసీపీ నేతలకు వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు.
మరోవైపు జగన్‌పై టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైఎస్‌లో ఉన్న 10శాతం మంచిగుణాలు కూడా జగన్‌లో లేవని ఆయన అచ్చం రాజారెడ్డిలాంటివాడని అన్నారు జేసీ. చంద్రబాబులో కూడా మార్పు రావాలని.. ఇప్పటికైనా.. శాంతివచనాలు పక్కనబెట్టాలని సూచించారు జేసీ. వైసీపీ కేసుల కారణంగా ఇబ్బంది పడుతోన్న కార్యకర్తలకు చంద్రబాబు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com