టెన్షన్.. టెన్షన్.. రాజధాని దారెటు?

కర్నూల్ టూ హైదరాబాద్. అక్కడ నుంచి అమరావతి. మరి ఇప్పుడు ఎటు? పరిపాలన వికేంద్రీకరణ కోసం జగన్ మూడు రాజధానుల ఫార్ముల థియరీ చెప్పగానే రాజధానిపై దుమారం మొదలైంది. ఈ నేపథ్యంలో అమరావతిపై రాజధానిపై కమిటీ రిపోర్ట్ ఏపీలో ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఏపీ రాజధాని అమరావతిలోనే ఉంటుందా? నిపుణుల నివేదిక పరిపాలన వికేంద్రీకరణ వైపు ఉంటుందా? లేదంటే అభివృద్ధి వికేంద్రీకరణ సిఫారసు చేస్తూ నివేదిక ఇస్తుందా? అనేది శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు టెన్షన్ రేకెత్తిస్తోంది.
సీఎం జగన్‌తో జీఎన్ రావు కమిటీ మధ్యాహ్నం 03.30కి సమావేశం అవుతారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి, రాజధానిపై అధ్యయనం చేసిన నిపుణుల కమిటీ, శుక్రవారం సీఎం జగన్‌కు తుది నివేదిక సమర్పించే అవకాశముంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాలోని ప్రజల అభిప్రాయాలను కమిటీ సేకరించింది. అయితే.. ఇప్పటికే మధ్యంతర నిఫుణుల కమిటీ నివేదిక ఇచ్చింది. శుక్రవారం ఇవ్వబోయేది ఫైనల్ రిపోర్ట్ కావటంతో ఏపీలో రాజధాని టెన్షన్ అమాంతంగా పెరిగిపోయింది.
ఏపీ రాజధానిపై ఇటీవలె కీలక వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులు వచ్చే అవకాశముందని అన్నారు. అమరావతిలో లెజిస్లేచర్ క్యాపిటల్, విశాఖలో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్, కర్నూలులో జ్యుడిషియరీ క్యాపిటల్ ఏర్పాటయ్యే అవకాశముందని తెలిపారు. జగన్ చెప్పిన ఈ మూడు రాజధానుల కాన్సెప్ట్‌పై తీవ్ర దుమారం రేగింది. టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలతో పాటు రాజధాని రైతులు జగన్ తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మూడు రాజధానుల ప్రసక్తే లేదని.. అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని డిమాండ్ చేశారు.
ఆందోళనలు ఇంకా కొనసాగుతుండగానే రాజధానిపై కమిటీ నివేదిక ప్రభుత్వ వాదనకు అనుకూలంగా ఉంటుందా? విపక్షాలకు ఊరటనిస్తుందా అనేది సస్పెన్స్ గా మారింది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలకు అందుబాటులో ఉండేలా అమరావతినే ఫైనల్ చేస్తారా? జగన్ ముందుగా చెప్పినట్లుగానే కర్నూలు, విశాఖ, అమరావతిలో రాజధాని ఉంటుందా? అనేది మరికొద్ది గంటల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com